ప్రైవేట్‌ టీచర్‌ కిడ్నాప్‌ కలకలం

20 Apr, 2018 10:02 IST|Sakshi
కిడ్నాపర్లుగా భావిస్తున్న వారిని విచారిస్తున్న కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ

బస్సు దిగి వెళుతుండగా అపహరణ 

ప్రయాణికులు  అప్రమత్తమై  పోలీసులకు  సమాచారం 

వెంబడించి 45 నిమిషాల్లోనే పట్టుకున్న పోలీసులు  

కణేకల్లు : ఓ ప్రైవేట్‌ టీచర్‌ కిడ్నాప్‌ కలకలం రేపింది. ప్రయాణికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం చేరవేయడంతో 45 నిమిషాల్లోనే కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. వివరాల్లోకెళితే.. రాయదుర్గానికి చెందిన యువతి కణేకల్లు మండలం ఆలూరులోని ప్రైవేట్‌ స్కూలులో టీచరుగా పనిచేస్తోంది. విధినిర్వహణలో భాగంగా గురువారం ఉదయం 7గంటలకు రాయదుర్గంలో ఆర్టీసీ బస్సు ఎక్కింది. సరిగ్గా 7.40గంటలకు ఆలూరు వద్ద బస్సు దిగి స్కూలు వద్దకు నడుచుకుంటూ వెళుతోంది. కణేకల్లులోని ద్విచక్రవాహన షో రూం యజమాని ముగ్గురు స్నేహితులతో కలిసి ఏపీ31 సీజే 2349 నంబర్‌ గల ఇన్నోవా కారులో వచ్చి టీచరును బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకున్నారు.

నన్ను కాపాడండి అంటూ ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇంకా ముందుకు కదలని ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు గమనించి వచ్చేలోపు కారు స్పీడుగా వెళ్లిపోయింది. వెంటనే జరిగిన విషయాన్ని ఎస్‌ఐ రామరావుకు ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చారు. ఆయన సమీపంలోని బెళుగుప్ప, రాయదుర్గం, కళ్యాణదుర్గంతోపాటు జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్‌లనూ అప్రమత్తం చేశారు. దుండగులు కణేకల్లువైపు వచ్చి షిర్డిసాయిబాబా దేవాలయం వద్ద కుడివైపున కొత్తపల్లి మీదుగా వెళ్లారు.

కళ్యాణదుర్గం వెళ్లే అవకాశముండటంతో అక్కడి పోలీసులు వాహనానికి ఎదురుగా వచ్చారు. అంతలోనే రాయదుర్గం ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ వాహనాన్ని ఛేజ్‌ చేయగా.. రమనేపల్లి వద్ద దుండగులు పట్టుబడ్డారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, కణేకల్లు ఎస్‌ఐ రామరావులు ఘటనస్థలానికెళ్లిన దుండగులను అదుపులో తీసుకున్నారు. అక్కడే గంటన్నర సేపు విచారణ చేపట్టారు. అనంతరం కణేకల్లు పోలీసుస్టేషన్‌కు బాధితురాలిని, కిడ్నాపర్లుగా భావిస్తున్న వారిని తీసుకొచ్చారు.   
కిడ్నాప్‌ కాదంటూ డీఎస్పీ క్లీన్‌చిట్‌  
ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ది కిడ్నాప్‌ కాదంటూ డీఎస్పీ వెంకటరమణ క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీచర్‌.. సదరు అబ్బాయి ప్రేమించుకుంటున్నారన్నారు. అయితే అబ్బాయికి ఇదివరకే పెళ్లయ్యిందని, భార్యకు విడాకులిస్తున్నాడని తెలిపారు. రెండో పెళ్లి చేసుకునే విషయమై మాట్లాడేందు కోసమే టీచర్‌ను కారులో తీసుకెళ్లాడని చెప్పారు. తననెవరూ కిడ్నాప్‌ చేయలేదంటూ టీచర్‌ కూడా చెప్పడంతో కేసును ఇంతటితో క్లోజ్‌ చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు. ఇరువురి స్టేట్‌మెంట్లు రికార్డు చేసిన పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండా వాళ్లను ఇళ్లకు పంపారు.  

భారీ ప్యాకేజీ
కిడ్నాప్‌ ఘటన విషయమై ఓ మంత్రి సోదరుడు పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు సమాచారం. కిడ్నాప్‌ చేసినోడు తమకు కావల్సిన వాడేనని కేసుల్లాంటివి లేకుండా చూడాలని హకుం జారీ చేసినట్లు తెల్సింది. అంతేకాక ఈ కేసులో హెల్ప్‌ చేసిన పోలీసులకు మంత్రి సోదరుడు కిడ్నాపర్లుగా భావిస్తున్న వారిని నుంచి భారీ ప్యాకేజీ ఇప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఐ రామరావును వివరణ కోరగా ఆరోపణలను కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు