జగన్‌ గెలుపు.. మా జీవితాల్లో వెలుగు

9 Apr, 2019 09:08 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సంఘీభావం ప్రకటిస్తున్న ప్రైవేట్‌ టీచర్స్, లెక్చరర్స్‌ యూనియన్‌ నేతలు

బండెడు చాకిరి.. బెత్తుడు జీతం.. ఇదీ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్ల పరిస్థితి. నెలంతా గొడ్డులా పనిచేసినా అందేది అరకొర వేతనం.. అది కూడా సమయానికి ఇవ్వని పరిస్థితి ప్రైవేటు పాఠశాలల్లో నెలకొన్నాయి. పైగా వారికి ఉద్యోగ భద్రత కూడా లేదు. వీరి ఈతిబాధలను ప్రజా సంకల్ప పాదయాత్రలో విన్న వైఎస్సార్‌ సీపీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ మేనిఫెస్టోలో వీరి సమస్యల పరిష్కారానికి కమిషన్‌ నియమించి, సీఎం నేరుగా పర్యవేక్షించేలా చర్యలుంటాయని హామీ ఇచ్చారు. ఈ హామీ పట్ల వీరిలో హర్షం వ్యక్తమవుతోంది.


సాక్షి ,రాయవరం (మండపేట): ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే ప్రతి ఉద్యోగులతో బండెడు చాకిరి చేయించుకున్నప్పటికీ వారికి కల్పించాల్సిన సదుపాయాలను కల్పించడం లేదు. వారికి పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలను యాజమాన్యాలు కల్పించాల్సి ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో అమలు కావడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు ఉదయం 7 నుంచి రాత్రి ఏడు గంటల వరకు పని చేస్తున్న ఉపాధ్యాయులు శారీరక, మానసిక వేదనకు గురవుతున్నారు. విద్యార్థుల పరిస్థితీ ఇంతే. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఈ సంస్థల్లో ఉపాధ్యాయులకు వేతనాలు రోజు కూలి చేసుకునే వారి కంటే అతి తక్కువ చెల్లిస్తున్నారని ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులకు ముందే విద్యార్థుల చేరికలపై ఉపాధ్యాయులకు టార్గెట్లు ఫిక్స్‌ చేస్తున్నారు. ఈ టార్గెట్‌ చేరుకోకుంటే తొలగించేందుకు కూడా వెనుకాడడం లేదు. తొలగింపు సమయంలో అప్పటి వరకు ఇవ్వాల్సిన వేతనాలను కూడా ఎగ్గొడుతున్నట్టు ప్రైవేటు పాఠశాలల, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆరోపిస్తున్నారు.  


రాష్ట్రంలో ఐదు లక్షల మంది.. 
రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో సుమారు ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి సమస్యలను అధ్యయనం చేసి, వారి పరిష్కారానికి కమిషన్‌ నియమిస్తానని వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడాన్ని వారు స్వాగతిస్తున్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయలేదని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును పలుసార్లు కలిశామని, యాజమాన్యాల డిమాండ్ల విషయంలో వెంటనే స్పందించిన తమ సమస్యలను మాత్రం పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత ఇచ్చిన హామీ నెరవేరితే ఐదు లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  


జగన్‌ను కలిసిన యూనియన్‌ నేతలు  
ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కమిషన్‌ వేస్తానంటూ మేనిఫెస్టోలో ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల యూనియన్‌ నేతలు ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ అధినేతను కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ గెలుపునకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు