పేరుకే పంతుళ్లు.. పనికి కూలీలు

11 Jul, 2018 12:17 IST|Sakshi

చాలీచాలని జీతంతో ప్రైవేట్‌ ఉపాధ్యాయుల అవస్థలు

నానా చాకిరీ చేయిస్తున్న యాజమాన్యాలు

టార్గెట్లు పేరుతో తీవ్ర ఒత్తిడిలు

12 గంటలకు పైగా పనిచేస్తున్న నిరుద్యోగులు.

రోజుకు రెండు గంటలు పనిచేసే ఉపాధి కూలీ నెలకు రూ. 6 వేలు వరకూ సంపాదిస్తున్నాడు. రోజుకు 12 గంటలు పనిచేసే ప్రయివేటు ఉపాధ్యాయుడు నెలకు 8 వేలు కూడా పొందలేకపోతున్నాడు. పేరుకు పంతుళ్లే అయినా వెట్టిచాకిరీ కూలీల్లా పనిచేస్తున్నారు. ఇదీ జిల్లాలో ప్రయివేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల దుస్థితి. కష్టపడి చదివినా ప్రభుత్వ కొలువులు లేవు. బీఈడీ, డిగ్రీలు పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగాలు లేక కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. కనీస వేతనం వీరికి కలగానే మిగిలిపోతుంది. నిరుద్యోగుల పేదరికం, ఉద్యోగ అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు చాలీచాలని జీతాలిస్తూ వారి శ్రమను నిలువునా దోచుకుంటున్నాయి.

యద్దనపూడి:  జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకూ బోధించే గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు 684 ఉన్నాయి. ఒక్కొక్క స్కూలుకు టీచింగ్‌ స్టాఫ్‌ 15 నుంచి 20 మంది వరకూ ఉంటారు. ఇతర సిబ్బంది మరో 10 నుంచి 15 మంది వరకూ ఉంటుంటారు. జిల్లాలో దాదాపు 12 వేల మందిపైగా ఆయా పాఠశాలల్లో బీఈడీ, డీఈడీ, డిగ్రీలు పూర్తిచేసిన వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఒక్క పర్చూరు డివిజన్‌ పరిధిలో ప్రైవేటు పాఠశాలలు 76 ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 10 మంది నుంచి 40 మంది వరకు ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. ఇలా దాదాపు 987 మంది దాకా ఆయా పాఠశాలలో నిరుద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. బీఈడీ, డీఈడీ పూర్తి చేసి అన్ని అర్హతలున్నా వారికి తగిన వేతనం ఇవ్వడం లేదు. ఇక సాదారణ డిగ్రీ చేసిన వారికైతే మరీ తక్కువగా ఉంటుంది. వీరిలో మహిళలైతే మరీ తక్కువగా ప్రాథమికంగా రూ. 3 వేల నుంచి 6 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. 

ఫీజులు ఘనం – వేతనాలు  నామ మాత్రం: యాజమాన్యాలు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా సిబ్బందికి మాత్రం రూ. వేలల్లో చెలిస్తున్నారు. జీఓ నెం 91 ప్రకారం విద్యా సంస్థలు వసూలు చేస్తున్న ఫీజుల్లో 50 శాతం మేర సిబ్బందికి జీత భత్యాలు చెల్లించాలి. కానీ అవేవీ మచ్చుకైనా కనిపించడం లేదు. దీనికి తోడు సంవత్సరంలో 10 నెలలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు.

వేసవిలో మాత్రం ప్రతి టీచరు కనీసం 10 మందిని తగ్గకుండా పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాల్సి ఉంటుంది. లేకుంటే వేరొకరిని నియమించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. యాజమాన్యాల ఒత్తిడిని తట్టుకోలేక కొందరు ఉపాధ్యాయులైతే ఉద్యోగం పోతుందన్న భయంతో సొంతంగా వారే తెలిసిన పిల్లల పేరుతో ప్రవేశ రుసుం చెల్లించి టార్గెట్‌లు పూర్తిచేశారు. ఉద్యోగ భద్రత కోసం మండుటెండల్లో ఇంటింటికి తిరిగి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

ఉపాధి కూలీలే నయం: యాజమాన్యాలు ఉపాధ్యాయులకు ఎక్కువగా బోధనాల కంటే విద్యార్థుల స్టడీ అవర్ల పేరుతో అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిలువు కాళ్లపై నిలబడి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు అయ్యవార్లు వాపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఉపాధి హామీ కూలీలే నయమని, వారు ఉదయం 8 గంటల నుంచి 10 గంటలు పని చేసినా 2 గంటలకే 200 రూపాయలకు తగ్గకుండా కూలీ వస్తుందని, తాము మాత్రం 12 గంటలు కష్టపడినా రోజుకు 150 రూపాయలు కూడా రావడంలేదని కొందరు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళా టీచర్లపై యాజమాన్యాల ఒత్తిళ్ళు చాలా దారుణంగా ఉంటున్నాయని, గత్యంతరం లేకే పని చేస్తున్నామని ఎవరికి చెప్పుకోలేక లోలోనే మదన పడుతున్నామని పలువురు వాపోతున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి ప్రయివేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులను నియత్రించి కనీస వేతనం 15 వేలకు తగ్గకుండా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు