తప్పిన పెను ముప్పు

31 May, 2015 23:31 IST|Sakshi
తప్పిన పెను ముప్పు

 కశింకోట : ఉగ్గినపాలెం వద్ద ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆదివారం క్రేన్లతో వెలికి తీశారు. ఈ బస్సు ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురవడం తెలిసిందే. ముందు వెళ్తున్న టిప్పర్ లారీని తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి ఇక్కడ మదుంపై నుంచి రక్షణ గోడను ఢీకొని పంట కాలువలోకి దూసుకుపోయి ఆగింది.

ఇది బోల్తా పడినా, టిప్పర్‌ను ఢీకొట్టినా పెద్ద ఎత్తున ప్రాణ హాని జరిగేదని స్థానికులు తెలిపారు. బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారిని వేరే బస్సులో పంపించారు. ప్రమాదం జరిగిన తీరు పరిశీలిస్తే పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగి ఉంటుందని భావించారు. గాయపడిన బస్సు డ్రైవర్ రాంబాబు అనకాపల్లి వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బస్సు ముందు భాగం దెబ్బతింది.

 అధిక వేగంతోనే అనర్థాలు
 జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్ బస్సులు మితిమీరిన వేగంతో పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు విశాఖ నుంచి ఎక్కువగా రాత్రి వేళ బస్సులను నడుపుతున్నారు. ట్రావెల్ బస్సుల మధ్య పోటీ వల్ల త్వరగా గమ్యానికి చేరుకోవ డానికి అతి వేగంగా బస్సులను నడుపుతున్నారు.

 ట్రాఫిక్ నిబంధనలను సైతం ధిక్కరిస్తున్నారు. రాత్రి వేళ ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉండటంతో అడ్డు అదుపు లేకుండా నడుపుతున్నారు. దీనివల్ల జాతీయ రహదారిపై ప్రయాణికులు, వాహన చోదకులు, పాదచారులకు భద్రత ఉండటం లేదు. ప్రైవేటు వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి రాత్రి వేళ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా