ప్రైవేటు ట్రావెల్‌ బస్సు దగ్ధం

30 Apr, 2017 02:16 IST|Sakshi
ప్రైవేటు ట్రావెల్‌ బస్సు దగ్ధం

- డ్రైవర్‌ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడిన పెళ్లి బృందం
- షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం!
- విశాఖ జిల్లాలో ఘటన


కశింకోట (అనకాపల్లి): విశాఖ జిల్లా కశింకోట మండలంలోని పరవాడపాలెం గ్రామం వద్ద శనివారం ప్రైవేటు ట్రావెల్‌ బస్సు కాలిపోయింది. కారు, బస్సు డ్రైవర్ల అప్రమత్తతతో 52 మంది సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. నష్టం సుమారు రూ.కోటికి పైగా ఉంటుదని అంచనా. హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన బంధు మిత్రులు   అనకాపల్లిలో జరిగే వివాహానికి వెళ్లేందుకు కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్కానియా బస్సులో  శుక్రవారం రాత్రి బయలుదేరారు. శనివారం ఉదయం 6.15 గంటల సమయంలో కశింకోట మండలంలోని పరవాడపాలెం గ్రామం వద్ద అమలోద్భవి హోటల్‌ సమీపానికి వచ్చేసరికి షార్టు సర్క్యూట్‌ వల్ల బస్సు వెనుక ఉన్న ఇంజన్‌ నుంచి పొగలు రావడాన్ని అదే మార్గంలో వస్తున్న ఓ కారు డ్రైవర్‌ గుర్తించారు.

బస్సు డ్రైవర్‌ కనకాల శ్రీనుకు విషయాన్ని తెలిపి అప్రమత్తం చేశాడు. దీంతో బస్సును నిలిపి తమ వద్ద ఉన్న    ఫైర్‌ డిస్టింగ్‌ ఫిషర్‌తో మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ప్రయాణికులను అప్రమత్తం చేసి దింపి వేశారు. దీంతో వారు సురక్షితంగా బయట పడ్డారు. బస్సు మంటల్లో చిక్కుకోవడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు దాదాపు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం వల్ల సుమారు 3 గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.   సీఐ రామచంద్రరావు, ఎస్‌ఐ బి.మధుసూదనరావు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.  కాలిపోయిన బస్సును క్రేన్ల సహాయంతో పక్కకు తొలగించారు.

మరిన్ని వార్తలు