‘ప్రైవేట్‌’ నిర్వాకం!

2 Apr, 2018 07:03 IST|Sakshi
మరమ్మతులకు గురైన (వైట్‌ కలర్‌) బస్సు నుంచి సామానులు దించుకుంటున్న ప్రయాణికులు

మరమ్మతులకు గురై భీమవరం టోల్‌ ప్లాజా వద్ద నిలిచిపోయిన టావెల్స్‌ బస్సు

తెల్లవారుజాము సమయంలో నానా అగచాట్లకు గురైన ప్రయాణికులు

వత్సవాయి (జగ్గయ్యపేట) : ఓ పైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు తెల్లవారుజామున మరమ్మతులకు గురై టోల్‌ప్లాజా సమీపంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా అగచాట్లకు గురైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 48 మంది ప్రయాణికులతో శనివారం బయలుదేరింది. తెల్లవారుజామున మండలంలోని భీమవరం టోల్‌ప్లాజా వద్దకు వచ్చేసరికి బస్సులో సాంకేతికలోపం ఏర్పడి నిలిచిపోయింది. అప్పుడు సమయం రాత్రి రెండు గంటలు అవుతోంది.  ఆ సమయంలో డ్రైవర్‌ మాత్రం ప్రయాణికులను దిగి వేరే బస్సు చూసుకోవాలని చెప్పాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. రాత్రి వేళ కావడం, ఎక్కడ ఉన్నారో తెలీక భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఆగ్రహానికి గురై డ్రైవర్‌తో గొడవకు దిగారు. అయినా, అతను మిన్నకుండిపోయాడు. దీంతో వృద్ధులు, పిల్లల తల్లులు బ్యాగులతో సహా రోడ్డు పక్కన కూర్చుండిపోయారు.

స్పందించిన అధికారులు...
అయితే, సమాచారం అందుకున్న రవాణా, పోలీస్‌ శాఖల అధికారులు స్పందించారు. రెండు శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రావెల్స్‌ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే బస్సును పంపించాలని ఆదేశించారు. దీంతో సూర్యాపేట జిల్లా నకరకల్లులో ఉన్న అదే ట్రావెల్స్‌కు చెందిన బస్సును పంపారు. దీంతో తెల్లవారుజామున వచ్చిన బస్సులో ప్రయాణికులు గమ్యస్థానాలకు వెళ్లారు. 

మరిన్ని వార్తలు