దూకుడు !

31 Mar, 2018 10:23 IST|Sakshi

బ్రేకుల్లేని ప్రైవేటు మాఫియా

అక్రమార్జన కోసం ట్రావెల్స్‌ చెలగాటం...

ప్రయాణికులకు ప్రాణసంకటం

పట్టించుకోని అధికారులు...కొమ్ముకాస్తున్న ప్రభుత్వ పెద్దలు

ఇదీ అమరావతి కేంద్రంగా వేళ్లూనుకున్న  ప్రైవేటు ట్రావెల్స్‌ మాఫియా స్వరూపం

అమరావతి కేంద్రంగా ఏటా రూ.1,200 కోట్లు దోపిడీరవాణానిబంధనలు బేఖాతరుటీడీపీనేతలఅండతోనేదందాచోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం రాజధానిలో ప్రైవేటు ట్రావెల్స్‌ దందా మూడు పువ్వులు..ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. నిబంధనలకు తూట్లు పొడిచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. టికెట్‌ ధరలు రెట్టింపు వసూలు చేస్తున్నా చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోతున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో ఆర్టీసీకి రూ.వందల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఓ వ్యూహం ప్రకారం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే  ప్రైవేటుకు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు చెందినవే మెజార్టీ ట్రావెల్‌ సంస్థలు ఉండటంతో ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తుందే తప్పా ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకు సిద్ధపడటం లేదని తెలుస్తోంది.

సాక్షి, అమరావతిబ్యూరో :  విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్‌ దందా చెలరేగిపోతోంది. అమరావతి పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ దాదాపు 800 బస్సులు నడుపుతున్నాయి. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాలతోపాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు సర్వీసులు నడుపుతున్నాయి.  సాధారణ రోజుల్లో విజయవాడ  నుంచి హైదరాబాద్‌కు రూ.650 నుంచి రూ.800 వరకు బస్సు చార్జీ ఉండగా... సీజన్‌లో రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తారు. విజయవాడ– విశాఖపట్నం టిక్కెట్‌ సాధారణ రోజుల్లో రూ.800 నుంచి రూ.వెయ్యి  వరకు ఉంటుంది. సీజన్‌లో ఆ టిక్కెట్‌ రూ.1,500 నుంచి రూ.2వేలు వరకు వెళుతుంది.

వ్యూహాత్మకంగానే ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారనే పలువురు ఆరోపిస్తున్నారు.  ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ప్రైవేటు ఆపరేటర్ల అక్రమ దందా వల్ల  ఆర్టీసీ ఏటా రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నష్టపోవాల్సి వస్తోంది. అందులో అమరావతి నుంచే దాదాపు రూ.800 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఆర్టీసీ నిర్ణయించిన టిక్కెట్‌ చార్జీల ప్రకారం లెక్కతేల్చిన నష్టం అది. కానీ ప్రైవేటు ట్రావెల్స్‌ చార్జీలను అమాంతంగా పెంచేసి అంతకు దాదాపు రెట్టింపు టర్నోవర్‌ను సాధిస్తున్నాయి. ఆ లెక్కన  రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్‌ ఏటా కనీసం  రూ.2,500 కోట్ల టర్నోవర్‌ సాధిస్తున్నాయన్నది సుస్పష్టం. అందులో అమరావతి కేంద్రంగా దాదాపు రూ.1,200 కోట్ల టర్నోవర్‌ ఉంది.

దర్జాగా ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం...
ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులకు కాంట్రాక్టు క్యారియర్లుగానే అనుమతి ఉంది. స్టేజ్‌ క్యారియర్లుగా అనుమతి లేదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్‌ క్యారియర్లుగానే నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం పూర్తిగా నిషిద్ధమైనా దర్జాగా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నాయి.

డ్రైవర్ల నిబంధనలూ బేఖాతరు....
డ్రైవర్లకు సంబంధించిన నిబంధనలను కూడా ప్రైవేటు ట్రావెల్స్‌ పట్టించుకోవడం లేదు. డ్రైవర్‌కు  8 గంటల పనిదినం ఉండాలి. అందులో 5గంటలే డ్రైవింగ్‌ చేయాలి. ఇక బస్సుకు కనీసం ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. ఈ నిబంధనను కూడా ప్రైవేటు ట్రావెల్స్‌ బేఖాతరు చేస్తున్నాయి. కంచికచర్ల వద్ద శుక్రవారం ప్రమాదానికి గురైన మార్నింగ్‌ ట్రావెల్స్‌ బస్సుకు ఒక్కరే డ్రైవర్‌ ఉండటం గమనార్హం. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు 2017, ఫిబ్రవరి 28న పెనుగంచిప్రోలు మండలంలో ప్రమాదానికి గురైన ప్రమాదంలో పదిమంది మృతి చెందారు. భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఆ బస్సుకు కనీసం ముగ్గురు డ్రైవర్లు ఉండాలి. కానీ ఇద్దరే ఉన్నారు.

అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం
టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై గత ఏడాది విజయవాడ నడిరోడ్డుపైనే దౌర్జన్యానికి దిగారు. తమ ప్రత్యర్థి సంస్థపై నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకోవాలన్న తన మాటను ఆయన వినకపోవడంతోనే ఎంపీ కేశినేని అంతటి వీరంగం సృష్టించారు.  కేశినేని ట్రావెల్స్‌ సిబ్బంది తమకు ఏడాదికిపైగా జీతాలు చెల్లించడం లేదని మొరపెట్టుకున్నా కార్మిక శాఖ అధికారులు పట్టించుకోలేదు.

ఇవీ ప్రమాదాలు....
నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్‌ ప్రయాణికులపాలిట మృత్యుశకటాలుగా మారుతున్నాయి.  2017, ఫిబ్రవరి 28న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో ప్రయాణించి అదుపుతప్పి కల్వర్టులో పడటంతో  పదిమంది దుర్మరణం చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ఆ ప్రమాదం నుంచి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సంస్థలుగానీ అధికారులుగానీ గుణపాఠం నేర్చుకోలేదు.

వేగ నియంత్రణ ఏదీ..?
జాతీయరహదారుల మీద వాహనాల వేగ నియంత్రణను అధికారులు పట్టించుకోవడం లేదు. స్పీడ్‌ గన్‌లు, స్పీడ్‌ హంటర్‌లతో వాహనాల వేగాన్ని పర్యవేక్షించాలి. ఎస్సై స్థాయి అధికారి తమ సిబ్బందితో ఈ బాధ్యతను నిర్వర్తించాలి.  వాహనాల వేగాన్ని కి.మీ. దూరం నుంచే అంచనా వేసి నియంత్రించాలి. కానీ అధికారులు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు.

మరిన్ని వార్తలు