దారులన్నీ ఊరి వైపే

7 Oct, 2019 13:35 IST|Sakshi
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో జనరల్‌ బోగీని తలపిస్తున్న స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ ,బస్సు ఎక్కేందుకు పోటీపడుతున్న ప్రయాణికులు

దసరా ఎఫెక్ట్‌

కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు

సరిపడా ఏర్పాట్లు లేక  అవస్థలు

బాదేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌

సాక్షి, విశాఖపట్నం: సిటీ ఆఫ్‌ డెస్టినీగా పేరొందిన విశాఖ నగరం పల్లెకు పరుగులెడుతోంది. సంక్రాంతి తర్వాత తెలుగు ప్రజలు అత్యంత ప్రాధాన్యమిచ్చే దసరా పండగ సందర్భంగా సొంతూళ్లలో సరదాగా గడిపేందుకు పయనమవుతున్నారు. విశాఖకు వచ్చే వారి కంటే నగరం నుంచి గ్రామాలకు వెళ్లేవారే అధికంగా ఉండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు  ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. నగరానికి ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం వచ్చి నివాసముంటున్నారు. పండగ సెలవులు రావడంతో పిల్లాపాపలతో సొంతూళ్లకు వారంతా పయనమవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ నగరం నుంచి బయలుదేరి వెళ్లే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.

‘ప్రత్యేక’ ఏర్పాట్లు చేసినా...  
దసరా సందర్భంగా రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. దసరా సెలవులకు నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్‌ బస్సులకు ఎక్కువ డిమాండ్‌ ఉండటంతో ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. గత సంవత్పరంలో ఉన్న పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. విశాఖ రీజియన్‌ నుంచి రెగ్యులర్‌గా తిరిగే వాటితోపాటు అదనంగా 200కి పైగా బస్సులతో విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమలాపురం, నర్సాపురం, భీమవరం తదితర దూరప్రాంత బస్సులతోపాటు విజయనగరం, రాజాం, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం, సోంపేట, ఇచ్ఛాపురం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వీటితోపాటు ఇరుగు పొరుగు ప్రాంతాలైన నరసన్నపేట, టెక్కలి, పలాస తదితర ప్రాంతాలకు బస్సులు నడుపుతోంది. ఇదే మాదిరిగా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే కూడా ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. దసరాకు ముందు వారం రోజుల నుంచి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాలకు 20కి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఓ వైపు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉండటంతో రైళ్లు, బస్సులు ఖాళీ ఉండటం లేదు. ముఖ్యంగా రైళ్లలోని జనరల్‌ బోగీల్లో అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి ఉండటంతో జరిమానాలు కట్టి మరీ రిజర్వేషన్‌ బోగీల్లో ప్రయాణాలు చేస్తున్నారంటే డిమాండ్‌ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్లీపర్‌ క్లాస్‌లు కూడా కాలు పెట్టలేనంతగా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.

విమానాలకూ పెరుగుతున్న గిరాకీ  
మరోవైపు కొంతమంది విమానాల్లో కూడా పయనమవుతున్నారు. ముఖ్యంగా హైదరా బాద్, విజయవాడ నుంచి విశాఖ వచ్చే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. దసరా కావడంతో వివిధ విమాన సర్వీసులు టికెట్‌ ధరని రెట్టింపు చేసేశాయి. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వచ్చేందుకు సాధారణ రోజుల్లో రూ.2,496 వరకూ టికెట్‌ ధర ఉండగా ప్రస్తుతం రూ. 4,921, 5,885, రూ.6,911 వరకూ ధర చెల్లించాల్సిందే. అదేవిధంగా విజయవాడ నుంచి విశాఖపట్నం విమానంలో రావాలంటే రూ. 3,996 వరకూ చెల్లించాల్సిందే. అయితే  బస్సు లకు రూ.3 వేల వరకూ చెల్లించి గంటల తరబడి ప్రయాణం చేసేబదులు మరికొంత డబ్బు చెల్లించి తక్కువ ప్రయాణ సమయంలో ఇళ్లకు చేరుకోవచ్చని చాలా మంది విమానాల్ని ఆశ్రయిస్తున్నారు. మొత్తంగా పండగ సం దడంతా ప్రయాణాల్లో కనిపిస్తోంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

రెండు రెట్లు ప్రైవేట్‌ బాదుడు
ఇదిలా ఉండగా ప్రైవేట్‌ బస్సుల యాజమాన్యాలు పండగ చేసుకుంటున్నాయి. ఎలాగైనా దసరా పండగను ఊరిలో చేసుకోవాలనే ప్రజ ల తాపత్రాయాన్ని, సెంటిమెంట్‌ను ప్రైవేటు బస్సుల నిర్వాహకులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఆర్టీసీ, రైల్వే చేసిన ఏ ర్పాట్లు డిమాండ్‌కు సరిపడా లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో  సుదూర ప్రాంతాలకు వెళ్లే వా రి నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నా రు. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌కు రూ. 700 నుంచి రూ.900 వరకూ ఏసీ సర్వీసులకు టికెట్‌ వసూలుచేసిన ప్రైవేటుబస్సులు.. దస రా రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖనుంచి హై దరాబాద్‌కు ఏకంగా రూ.1800, రూ. 2,678, రూ.3000వరకూ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా విజయవాడకు రూ.1800, రూ.2,550, రూ.2,670వరకూ ఛార్జీలు బాదుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలుసైతం రెట్టింపు భా రాన్నిమోస్తూ ఉసూరంటూ ఊళ్లకు వెళ్తున్నారు.

మరిన్ని వార్తలు