రాజధానిలో.. ఇక అంతా ప్రైవేటీకరణే!

24 Mar, 2016 08:52 IST|Sakshi

     ఉన్నత, సాంకేతిక విద్య, వైద్యం, విద్యుత్,
     పట్టణ వసతులన్నీ ప్రైవేటుకే..
     ఐఎన్‌సీఏపీ, ఏపీ ఇన్వెస్ట్, ఎస్‌ఐబీపీ, ఎస్‌టీపీబీలకు స్వస్తి
     ఇవన్నీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిలో విలీనం
     కార్పొరేట్ సామాజిక బాధ్యత పేరిట ఆదాయ వనరుల సమీకరణ
     పెట్టుబడులు సమకూర్చే నిధిసహా ఐదు రకాల నిధుల ఏర్పాటు


సాక్షి, హైదరాబాద్ : ఏపీ నూతన రాజధానిలో ఇక ఏదీ రాష్ట్రప్రభుత్వం చేయదు. అంతా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే చేపడతారు. ఉన్నత, సాంకేతిక విద్యా సదుపాయాలతోపాటు వైద్య, ఆరోగ్యం, విద్యుత్, పట్టణ వసతుల కల్పన.. ఇలా అన్నింటినీ పీపీపీ పద్ధతిలో ప్రైవేటువారికే అప్పగించనున్నారు. ఇందుకవసరమైన విదేశీ, స్వదేశీ పెట్టుబడులను రాబట్టేందుకు, అలాగే రాష్ట్రంలో పన్నులు, యూజర్ చార్జీల రూపంలో ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ లక్ష్యాల సాధన కోసమే ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలి ఏర్పాటుతో ప్రస్తుతమున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐఎన్‌సీఏపీ), ఏపీ ఇన్వెస్ట్ సంస్థతోపాటు  రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ), రాష్ట్ర టూరిజం ప్రోత్సాహక మండలి(ఎస్‌టీపీబీ)కి స్వస్తి పలికారు. ఈ సంస్థలన్నింటినీ ఆర్థికాభివృద్ధి మండలిలో విలీనం చేశారు. పెట్టుబడుల్ని రాబట్టడంలోను, ఆకర్షించడంలోను పైన పేర్కొన్న సంస్థలు, మండళ్లు విఫలమైనట్టు భావించిన ప్రభుత్వం వాటిని రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిలో విలీనం చేసింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి(ఈడీబీ)ని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్  ఉత్తర్వులు జారీ చేశారు. అందులో పేర్కొన్న మేరకు.. ఆర్థికాభివృద్ధి మండలి స్వరూపం.. చేయాల్సిన పనులకు సంబంధించిన ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
 
 రాష్ట్ర ఆర్థికాభివృద్ధికోసం జాతీయ, అంతర్జాతీయ వ్యాపారసంస్థలు, వ్యాపారవేత్తలనుంచి పెట్టుబడుల్ని రాబట్టడం. పట్టణ మౌలిక వసతులు, ఇంధనం, పర్యాటక, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వైద్య ఆరోగ్యం, స్కిల్ అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో ప్రైవేట్‌సంస్థల నుంచి పెట్టుబడుల్ని తీసుకురావడం.


 కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆదాయ వనరుల్ని సమీకరించడం. ఆర్థికాభివృద్ధి మండలిలో భాగంగా ప్రణాళిక వ్యూహం.. విధానం డివిజన్, పెట్టుబడుల ప్రోత్సాహక డివిజన్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం డివిజన్, ఆదాయ వనరుల సమీకరణ డివిజన్, స్పెషల్ వెహికల్స్ డివిజన్ ఉంటాయి.

ఆర్థికాభివృద్ధి మండలి అవసరమైన సేవల్ని సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్‌ప్రైజెస్, యూరోపియన్ పీపీపీ సెంటర్, ప్రపంచబ్యాంక్ పీపీపీ రిసోర్స్‌సెంటర్‌ల నుంచి పొందుతుంది


 ఆర్థికాభివృద్ధి మండలిలో ఐదు నిధులను ఏర్పాటు చేస్తారు. ఇందులో పెట్టుబడులు సమకూర్చే నిధి ఒకటి. దేశ, విదేశాల్లో పెట్టుబడుల సదస్సుల ఏర్పాటుకు, అలాగే రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై డాక్యుమెంటరీలు, ఇతర బ్రోచర్లద్వారా ప్రచారం చేయడానికి దీన్ని వినియోగిస్తారు.

సామర్ధ్య అభివృద్ధి నిధిని మైక్రో ఎకనమిక్స్, పీపీపీ శిక్షణలకు, దేశ విదేశాల్లో వర్క్‌షాపుల నిర్వహణకు వినియోగిస్తారు.

ప్రాజెక్టు అభివృద్ధి నిధిని ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమికంగా సాంఘిక, ఆర్థిక స్థితిగతులు, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, న్యాయపరమైన, పర్యావరణపరమైన అధ్యయనాలకోసం వినియోగిస్తారు.

వయబులిటీ గ్యాప్ నిధిని ప్రైవేట్ సంస్థ చేపట్టే ఏదైనా ప్రాధాన్యతగల ప్రాజెక్టుకయ్యే వ్యయంలో అంతరముంటే దానికి సంబంధించిన నిధుల్ని ప్రభుత్వం ఇచ్చేందుకు వినియోగిస్తారు.

ఇన్నోవేషన్ నిధిని పారిశ్రామిక, వాణిజ్య వ్యాపారాల్లో వినూత్న ఆలోచనలు, నూతన ధోరణుల గురించి వినియోగిస్తారు.
రైతు సాధికార కార్పొరేషన్‌కు, మహిళా సాధికార కార్పొరేషన్‌కు, కేపిటల్ సిటీ సర్వీసెస్‌కు, స్మార్ట్ సిటీ సర్వీసెస్‌కు, పారిశ్రామిక కారిడార్లకు, ఏపీ ఇన్నోవేషన్‌కు స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను ఏర్పాటు చేస్తారు.

ఆదాయ వనరుల సమీకరణల్ని రిటైల్ పెట్టుబడిదారులనుంచి, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కార్పొరేషన్స్, మ్యూచువల్ ఫండ్, యూనిట్స్, బాండ్లద్వారా చేపడతారు. అలాగే అంతర్గత ఆదాయ వనరుల పెంపునకు పన్నులస్థాయిని పెంచడంతోపాటు పన్నురేట్ల పెంపు, యూజర్‌చార్జీల విధింపు వంటి చర్యలు చేపడతారు.
 
 1991 నుంచి వచ్చింది రూ.41,860 కోట్లే!
1991 ఆగస్టు నుంచి మార్చి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం రూ.8.96 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా.. వాటిలో కేవలం రూ.41,860 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు మాత్రమే అమలైనట్లు ఆర్థికశాఖ గుర్తించింది. ఇది ప్రతిపాదనల్లో కేవలం 4.67 శాతం మాత్రమేనని పేర్కొంది.

మరిన్ని వార్తలు