రోజాపై మరో ఏడాది సస్పెన్షన్‌కు సిఫార్సు

17 Mar, 2017 02:38 IST|Sakshi
రోజాపై మరో ఏడాది సస్పెన్షన్‌కు సిఫార్సు

శాసనసభకు ప్రివిలేజ్‌ కమిటీ నివేదిక సమర్పణ
సాక్షి,  అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  ఆర్‌.కె.రోజాను మరో ఏడాది పాటు ఏపీ శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలని శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ సిఫార్సు చేసింది. టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజ్‌ కమిటీ మార్చి 4న సమావేశమై రూపొందిం చిన నివేదికను గురువారం శాసనసభకు సమర్పించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాను ఇప్పటికే ఒక ఏడాది సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.  కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై అసెంబ్లీలో  ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినపుడు.. ఆమె ప్రవర్తనను తప్పు పడుతూ 2015, డిసెంబర్‌ 18న శాసనసభ నుంచి ప్రివిలేజ్‌ కమిటీకి పంపకుండానే నేరుగా సస్పెండ్‌ చేశారు.

 ఏడాది సస్పెన్షన్‌ ముగిసినందున ఆమె ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన శాసనసభకు హాజరవుతున్నారు. ఈతరుణంలో మళ్లీ మరో ఏడాది ఆమెను సభలో నుంచి సస్పెండ్‌ చేయాలని ప్రివిలేజ్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఎమ్మెల్యే రోజా గతేడాది ఏప్రిల్‌ 6న కమిటీ ముందు హాజరయ్యారని, తన ప్రవర్తనకు రోజా మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేయలేదని, బేషరతుగా క్షమాపణ చెప్పలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది.  అయితే ఏడాది సస్పెన్షన్‌ను ఏ తేదీ నుంచి అమలు చేయాలనే అంశాన్ని శాసనసభకే వదలి వేస్తున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు