‘సాక్షి’ స్పెల్‌బీకి విశేష స్పందన

16 Dec, 2013 03:26 IST|Sakshi

 సప్తగిరికాలనీ, న్యూస్‌లైన్ :  సాక్షి, ఇండియా స్పెల్‌బీ ఆధ్వర్యంలో నగరంలోని ఐరిస్ వరల్డ్ స్కూల్‌లో ఆదివారం జరిగిన స్పెల్‌బీ జోనల్ రౌండ్ పరీక్షకు విశేష స్పందన వచ్చింది. అక్షరదోషాలు లేకుండా ఆంగ్ల పదాలు రాయడం.. వాటిని ఎలా పలకాలో క్లుప్తంగా వివరించడం.. కొత్త ఆంగ్ల పదాలు విద్యార్థులకు పరిచయం చేయడానికి సాక్షి, ఇండియాస్పెల్ ఆధ్వర్యంలో స్పెల్‌బీ పరీక్షను దేశమంతటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ రౌండ్‌లో విజేతలకు జోనల్‌స్థాయిలో పరీక్ష నిర్వహించారు. దీనికి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు.

కేటగిరీ-1లో ఒకటి, రెండో తరగతి, కేటగిరీ-2లో మూడు, నాలుగు, కేటగిరీ-3లో ఐదు నుంచి ఏడు, కేటగిరీ-4లో ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 211 మంది హాజరుకాగా.. ‘సాక్షి’ టీవీ లైవ్ ద్వారా హైదరాబాద్ నుంచి ప్రశ్నలు వేశారు. వాటికి అక్షరదోషాలు లేకుండా విద్యార్థులు పదాలు రాశారు. లైవ్ ద్వారా పరీక్ష కావడంతో చిన్నారులు సంతోషంగా పాల్గొన్నారు. పరీక్షను సాక్షి రీజనల్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఐరిస్, పారమిత విద్యాసంస్థల అధినేత ప్రసాద్‌రావు పర్యవే క్షించారు. కార్యక్రమంలో సాక్షి డెప్యూటీ మేనేజర్ సంపత్‌కుమార్, ఇండియా స్పెల్‌బీ ప్రతినిధి సాయినాథ్‌రెడ్డి, ఐరిస్ పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప్‌దత్త, సాక్షి సిబ్బంది పాల్గొన్నారు

మరిన్ని వార్తలు