అశ్రునయనాల మధ్య ప్రియదర్శిని అంత్యక్రియలు

12 Dec, 2013 00:33 IST|Sakshi
అశ్రునయనాల మధ్య ప్రియదర్శిని అంత్యక్రియలు

 దుఃఖంలోనూ చిన్నారి నేత్రాలను
 దానం చేసిన తల్లిదండ్రులు
 ఘాతుకంపై నివేదికకు లోకాయుక్త ఆదేశం
 రైల్వే ఎస్పీకి నోటీసులు


 ఉన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏడేళ్ల చిన్నారి ప్రియదర్శిని అంత్యక్రియలు బుధవారం ఆమె స్వగ్రామమైన మెదక్ జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. కోయినాపల్లితోపాటు సమీప గ్రామాల ప్రజలు కూడా భారీగా తరలివచ్చి ప్రియదర్శిని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు మంగళవారం రాత్రి ప్రియదర్శిని మృతదేహానికి గాంధీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు గాంధీ ఆస్పత్రికి చేరుకుని ప్రియదర్శిని కళ్లు దానంగా ఇవ్వడానికి తల్లిదండ్రులు శ్రీనివాస్, సోనీలను ఒప్పించారు. కూతురు లేదన్న అంతులేని విషాదంలోనూ వారు చిన్నారి కళ్లను దానం చేసి తమ గొప్ప మనసును చాటుకున్నారు. మరో ఇద్దరి కంటిచూపునకు దారి చూపారు.  

 సైకోకు రిమాండ్..

 ప్రియదర్శినిపై కత్తితో పాశవికంగా దాడి చేసి హ తమార్చిన సైకోను బుధవారం సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మంగళవారం మధ్యాహ్నం పెళ్లికి హాజరయ్యేందుకు నానమ్మ, తండ్రితో కలసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చిన ముషీరాబాద్ గంగపుత్రకాలనీకి చెందిన ప్రియదర్ళినిపై చిత్తూరు జిల్లాకు చెందిన ఉన్మాది కోలా కరణ్‌కుమార్ కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల సహకారంతో సైకోను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉన్మాది దాడిపై ఈ నెల 16లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి రైల్వే ఎస్పీని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. చిన్నారి మృతికి రైల్వే పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం బుధవారం లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఈ మేరకు ఆదేశించారు.

 భద్రతపై రైల్వే జీఎం సమీక్ష


 రైల్వే స్టేషన్లు, పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) పి.కె.శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సైకో చేతిలో చిన్నారి హత్యకు గురైన నేపథ్యంలో ఆయన బుధవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 10వ ప్లాట్‌ఫాం వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రయాణికుల భద్రతపై రైల్‌నిలయంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు