పోలింగ్‌ బూత్‌లలో జర భద్రం

15 Mar, 2019 13:14 IST|Sakshi
పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులుదీరిన ఓటర్లు (ఫైల్‌)

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను మూడు కేటగిరీలుగా విభజన

అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరికలు

సాక్షి, చీమకుర్తి(ప్రకాశం): ఎన్నికల్లో ఎలాగైనా గెలావాలి.. పోటీ చేసేవారైనా, వారి తరఫున వారి అభిమాన కార్యకర్తలైనా సరే.. ప్రత్యర్థిని ఓడించి గెలిచేందుకు, లేక గెలిపించేందుకు ఎంతకైనా సిద్ధమే. అందుకే పోలింగ్‌ జరిగే నాడు గ్రామాల్లో హోరాహోరీగా ఎన్నికలు జరిగే క్రమంలో ఎన్నికల విధులు నిర్వహించాలంటే అధికారులు భయాందోళనలు చెందుతుంటారు. అలాంటి వివాదాస్పద గ్రామాలలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీసులకు తల ప్రాణం తోకకొచ్చినంత పనవుతుందని ఆందోళన చెందుతుంటారు. అలాంటి పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల పరిభాషలో పోలీసులు సమస్యాత్మక గ్రామాలుగాను, సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్‌లుగా పోలీస్‌ రికార్డులలో ప్రత్యేకంగా నమోదై ఉంటుంది. పోలింగ్‌ రోజున జరిగే గొడవలతో పాటు పోలింగ్‌ ఏకపక్షంగా జరిగినా, పోటీలో ఉన్న ఒకే వ్యక్తికి 90 శాతానికి పైగా ఓట్లు పోలైనా అలాంటి పోలింగ్‌ స్టేషన్‌లను సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా పోలీసులు ప్రత్యేక ముద్ర వేస్తారు.

అత్యధికంగా సంతనూతలపాడు మండలంలో ఉన్నదే 60 పోలింగ్‌ స్టేషన్‌లు అయితే వాటిలో 54 క్రిటికల్‌ బూత్‌లే ఉండటం విశేషం. తర్వాత స్థానం నాగులుప్పలపాడు మండలంలో 74 బూత్‌లకు గాను 53 క్రిటికల్‌ బూత్‌లే ఉన్నాయి. అన్నిటికంటే తక్కువుగా మద్దిపాడు మండలంలో 54కి 24 బూత్‌లు మాత్రమే క్రిటికల్‌ గా నమోదై ఉన్నాయి. ఇక చీమకుర్తి పట్టణంలో 23 పోలింగ్‌ బూత్‌లు ఉంటే వాటిలో 21 పోలింగ్‌ బూత్‌లు క్రిటికల్‌గా నమోదై ఉన్నాయి. ఇక  చీమకుర్తి మండలం మొత్తం మీద 68 బూత్‌లకు గాను 42 క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్‌లుగా నమోదై ఉన్నాయి.

 మండలం  క్రిటికల్‌  నార్మల్‌  మొత్తం
 చీమకుర్తి  42  26  68
 సంతనూతలపాడు  54  6  60
 మద్దిపాడు  24  30  54
 నాగులుప్పలపాడు  53  21  74
 మొత్తం  173  83  256

కేటగిరీలుగా విభజన..
చీమకుర్తి మండలంలోని కూనంనేనివారిపాలెం, గాడిపర్తివారిపాలెం, ఎర్రగుడిపాడు, ఇలపావులూరు, పల్లామల్లి వంటి గ్రామాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలను పోలీసులు మూడు రకాల కేటగిరీలుగా విభజించారు. నేర చరిత్ర, రిగ్గింగ్‌ స్వభావం ఎక్కువుగా ఉన్న పోలింగ్‌ కేంద్రాలను హైపర్‌ క్రిటికల్‌ గాను, మీడియం స్టేజిలో ఉన్న వాటిని క్రిటికల్‌ విభాగంలోను, సాధారణ స్థాయిలో ఉన్న వాటిని నార్మల్‌ పోలింగ్‌ స్టేషన్‌లుగాను విభజించారు. సంతనూతలపాడు నియోజకవర్గలోని నాలుగు మండలాల్లో మొత్తం 256 పోలింగ్‌ స్టేషన్‌లు ఉన్నాయి. వాటిలో హైపర్‌ క్రిటికల్‌ కేటగిరీలో ఒక్కటి కూడా లేదని, పోలీస్‌ రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. క్రిటికల్‌ విభాగంలో 173, నార్మల్‌ విభాగంలో 83 ఉన్నాయి.

నియోజకవర్గంలో 173 బూత్‌లు సమస్యాత్మకంగా ఉన్నాయి

సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో కలిపి 256 పోలింగ్‌ బూత్‌లు ఉంటే వాటిలో 173 బూత్‌లు క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్‌లుగా నమోదు చేయబడ్డాయి. 86 మాత్రమే నార్మల్‌ కండిషన్‌లో ఉన్నాయి. ఎన్నికలప్పుడు ఆయా గ్రామాలలో గతంలో జరిగిన నేరాలు, ఓటింగ్‌ సరళి ఒకే వ్యక్తికి ఏక పక్షంగా ఓట్లు పోలైనా క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్‌లుగా నమోదు చేయటమైనది. 
- ఓ.దుర్గా ప్రసాద్, సీఐ, ఒంగోలు రూరల్‌

మరిన్ని వార్తలు