సమస్యలు యథాత థం

27 May, 2014 00:41 IST|Sakshi
సమస్యలు యథాత థం

 సాక్షి, కాకినాడ : సుమారు మూడు నెలల అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారులకు వివరించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరూ స్థానికంగా లేకపోవడంతో అదనపు జాయింట్ కలెక్టర్ డి.మార్కండేయులు, డీఆర్వో బి.యాదగిరి గ్రీవెన్స్ నిర్వహించారు. ఎప్పటిలాగే రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ, ఉపాధి తదితర అంశాలపై అర్జీలు అందాయి. అదే విధంగా పదో తరగతిలో మార్కులు అధికంగా తెచ్చుకున్నామని, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ చదివేందుకు ఫీజులు, వసతి కల్పించాలని కోరుతూ యువత గ్రీవెన్స్‌లో అధికారులకు మొరపెట్టుకుంది. వాటిని పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కిందిస్థాయి అధికారులను ఏజేసీ, డీఆర్వో ఆదేశించారు.
 
 చేపల చెరువులు తవ్వేస్తున్నారు...
 తొండంగి మండలం ఏవీ నగరంలో ఊరి చుట్టూ  చేపల చెరువులు తవ్వుతున్నారని  దళితులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు వచ్చి ఆందోళన చెందారు. దళిత కాలనీని ఆనుకుని వున్న పంట భూముల్లో కొందరు పెద్దలు చెరువులు తవ్వి చేపలు ఏపుగా పెరగటం కోసం చుట్టు పక్కల ఏ జంతువు చచ్చినా తీసుకొచ్చి చెరువుల్లో వేస్తున్నారన్నారు. వాతావరణ కాలుష్యంతోపాటు  దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటోందని వారు వాపోయారు. అనంతరం ఏజేసీకి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఏడెకరాల చెరువుందని, మరో పదకొండు ఎకరాల చెరువు తవ్వుతుండగా ఇంకా కొత్త చెరువుల ఏర్పాటుకు కొందరు పెద్దలు ప్రణాళికలు వేశార ని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
 వేలిముద్ర పడడం లేదని పింఛను కట్

 ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన దిడ్డి వరలక్ష్మి వికలాంగురాలు. ఆమెకు ప్రతి నెలా రూ. 500 పింఛను వచ్చేది. ఉపాధి కూలీ కూడా పనికి తగ్గ వేతనం అందుకునేది. ఆమె చేతి వేళ్ల ముద్రలు సరిగా పడకపోవడంతో మూడు నెలల నుంచి పింఛను అందడం లేదు. ఉపాధి హామీ కూలీ కింద పోస్టాఫీసులో ఏడాది నుంచి సొమ్ము అందడం లేదు. తన తండ్రితో పాటు కలెక్టరేట్‌కు వచ్చిన వరలక్ష్మి అధికారులకు వినతిపత్రం అందించి న్యాయం చేయాలని కోరింది. అలాగే మరిన్ని ముఖ్య సమస్యలపై పలువురు అర్జీలు అందజేశారు. వాటిని పరిశీలించి న్యాయం చేస్తామని
 అధికారులు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు