భౌబోయ్‌!

27 Feb, 2018 07:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జిల్లాలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. జనంపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వీటి బెడద మరీ ఎక్కువగా ఉంది. నియంత్రణ చర్యలపై ప్రభుత్వం ఏ మాత్రమూ దృష్టి సారించడం లేదు. పెంపుడు కుక్కలకు కూడా రేబిస్‌ నివారణ టీకాలు నామమాత్రంగానే వేస్తున్నారు. 

కర్నూలు(అగ్రికల్చర్‌): వీధి కుక్కల నియంత్రణ చర్యలను అర్బన్‌ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు,  గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు చేపట్టాల్సి ఉంటుంది. వీటి సంతతి తగ్గించేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు శస్త్ర చికిత్సలు చేయాలి. జిల్లాలో ఇటు అర్బన్‌ ప్రాంతాల్లోనూ, అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వీధి కుక్కల సంతతి అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతూనే ఉంది. 2012 పశుగణన ప్రకారం జిల్లాలో 65 వేల వీధి కుక్కలు ఉండగా, నేడు వీటి సంఖ్య 1.25 లక్షలకు చేరింది.

కృష్ణగిరి మండలం చిట్యాలలో చిన్నారి ఇబ్రహీంను వీధి కుక్కలు కొరికి చంపాయంటే వీటి వల్ల ప్రమాదం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఈ ఘటన తర్వాత కూడా అధికారులు స్పందించలేదు. కర్నూలు నగరపాలక సంస్థలో వీధికుక్కల నియంత్రణకు కొంత ప్రయత్నం జరిగినా తర్వాత గాలికొదిలేశారు. కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఎమ్మిగనూరు తదితర పట్టణ ప్రాంతాల్లో, మేజర్, మైనర్‌  పంచాయతీల్లో శునకాల బెడద ఎక్కువగా ఉంది. 

జూనోసిస్‌ దినోత్సవం రోజునే టీకాలు 
పశుసంవర్ధక శాఖ ప్రతి ఏటా జూలై 24న జూనోసిస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు రేబిస్‌ టీకాలు నామమాత్రంగా వేస్తోంది. వీధి కుక్కల గురించి అసలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో వీధి కుక్కలు 1.25 లక్షల వరకు ఉండగా, పెంపుడు కుక్కలు దాదాపు ఎనిమిది వేల వరకు ఉన్నాయి. పెంపుడు కుక్కల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీధికుక్కలను ఏ మాత్రమూ పట్టించుకోకుండా  పశుసంవర్ధకశాఖ, మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజలపైకి వదులుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని రేబిస్‌ రహితంగా తీర్చిదిద్దాలని భారత జంతు సంక్షేమ సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో చర్యలు మాత్రం లేవు. 

నియంత్రణే ముఖ్యం 
పెంపుడు కుక్కలతో పాటు వీధికుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్‌లు చేయడానికి అవకాశాలున్నాయి. కర్నూలులో 9,600 వీధికుక్కలు ఉండగా.. ఇందులో 25 శాతం వరకు జనన నియంత్రణ ఆపరేషన్‌లు చేశారు. ఈ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించినప్పటికీ అవి జవాబుదారీతనంతో పనిచేయలేదు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ ఊసే లేదు. ఆపరేషన్‌ అయిన కుక్కలు దీర్ఘాయుస్సుతో బతకడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కరవడం కూడా చాలా తక్కువ.  చెవిని కత్తిరించి వీ ఆకారంలో ఉంటే ఆపరేషన్‌ అయ్యిందని గుర్తు.

పెంపుడు కుక్కలకు కూడా విధిగా జనన నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించాలి. ప్రపంచ ఆరోగ్య సంçస్థ తన నివేదికలో 75 శాతం వీధికుక్కలకు రేబిస్‌ టీకాలు వేయడం వల్ల ఆ ప్రాంతాన్ని రేబిస్‌ రహితంగా మార్చవచ్చని సూచించింది. వీటికి  మూడు నెలల వయస్సులో తప్పనిసరిగా టీకాలతో పాటు ప్రతి ఏటా బూస్టర్‌ డోస్‌ వేయించాలి. అప్పుడే వాటి వల్ల ప్రజలకు ప్రమాదం ఉండదు. 

ఈ నెల 21న ప్యాపిలి మండలం హుసేనాపురంలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కన్పించిన వారినల్లా కరుస్తూ వెళ్లింది. ఈ క్రమంలో దాదాపు పదిమంది గాయపడ్డారు.  ఇదే రోజు గూడూరు మండలం చనుగొండ్ల, మునగాలలో నలుగురు వ్యక్తులు వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు

ఇలా చేస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చు .. 
- కుక్క దగ్గరికి వస్తే కదలకుండా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తరాదు.  కళ్లలోకి తదేకంగా చూడరాదు. కుక్క పిల్లల దగ్గరికి వెళ్లరాదు.  
- నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లలకు పాలిస్తున్నప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరాదు. 
-  కుక్క దాడి చేసేటప్పుడు ముఖాన్ని పంచె లేదా తువ్వాలు తదితర వాటితో కప్పుకోవాలి.  ఏమీ లేకపోతే చొక్కాను పైకి జరుపుకోవాలి. లేదా ముఖాన్ని చేతులతో కప్పుకోండి. ముఖంపై కరిస్తే ఇన్‌ఫెక్షన్‌ మెదడుకు త్వరగా సోకుతుంది. దీనివల్ల ప్రాణహాని ఉండే ప్రమాదం ఉంది. 
- కుక్క కోపంగా దగ్గరికి వస్తే నేల వైపు చూస్తూ దానికి దూరంగా మెల్లగా నడవాలి. 

నియంత్రణ చర్యలు తీసుకోవాలి
వీధి వీధినా కుక్కలు ఉంటున్నాయి. వాటిని దాటుకొని పోవాలంటేనే భయమేస్తోంది. మరోవైపు ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్‌ టీకాలు అందుబాటులో ఉండడం లేదు. వీధి కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు చొరవ చూపాలి. 
– కర్రెక్కగారి నాగిరెడ్డి, వెల్దుర్తి     

 రేబిస్‌ అత్యంత ప్రమాదకరం 
రేబిస్‌ వ్యాధి అత్యంత ప్రమాదకరం. కుక్క కాటు వల్ల ఇది సోకుతుంది. వ్యాక్సిన్‌ వేయించిన కుక్క కాటు వల్ల ప్రమాదం లేదు. వేయించని కుక్క కాటు అత్యంత ప్రమాదకరం. కావున వెంటనే యాంటీ రేబిస్‌ టీకా వేయించుకోవాలి.  కరిచిన వెంటనే చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుంది.  పెంపుడు కుక్కలకు విధిగా వ్యాక్సిన్‌ వేయించాలి.
– డాక్టర్‌ మల్లికార్జున్, కర్నూలు 
 

మరిన్ని వార్తలు