బిల్లులేవీ..

15 Apr, 2017 12:58 IST|Sakshi

► భారంగా సీజనల్‌ హాస్టళ్ల నిర్వహణ
► జిల్లాలోని 14 మండలాల్లో 65 ఏర్పాటు
► జనవరి నుంచి విడుదల కాని బిల్లులు
► హాస్టళ్ల నిర్వహణకు  అష్టకష్టాలు
► గౌరవ వేతనానికీ నోచుకోని సిబ్బంది

బేస్తవారిపేట: ప్రభుత్వం వలస కూలీల పిల్లలకు విద్యలో ఎటువంటి ఆటంకం కలుగకూడదని సీజనల్‌ హాస్టల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరిలో సీజనల్‌ హాస్టల్స్‌ ప్రారంభించారు. మూడు నెలలు దాటినా ఒక్క రూపాయి బిల్లు మంజూరు చేయకపోవడంతో నిర్వాహకులు హాస్టల్స్‌ నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.                 

కుటుంబ పోషణ కోసం దూరప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు ఎక్కువగా ఉండే జిల్లాలోని బేస్తవారిపేట, చీమకుర్తి, దొనకొండ, దోర్నాల, గిద్దలూరు, కొమరోలు, కొత్తపట్నం, మార్కాపురం, పర్చూరు, పుల్లలచెరువు, పెద్దారవీడు, తర్లుపాడు, త్రిపురాంతకం, వై.పాలెం మండలాల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో హాస్టల్స్‌ ప్రారంభించారు. 14 మండలాల్లో 27 ఎన్‌జీవోలు హాస్టల్స్‌ నిర్వహణ చేపట్టారు. జిల్లాలోని 65 హాస్టల్స్‌లో 3153 మంది విద్యార్థులకు వసతి కల్పించారు.

జనవరి నుంచి హాస్టల్‌ బిల్లులు విడుదల చేయలేదు. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.650 చెల్లించాల్సి ఉంది. 50 మంది విద్యార్థులున్న సెంటర్‌కు నెలకు రూ.32,500 ప్రకారం మూడు నెలలకు రూ.97,500 చెల్లించాల్సి ఉంది. ఒక్కో స్వచ్ఛంద సంస్థ రెండు నుంచి ఐదు హాస్టల్స్‌ నిర్వహిస్తున్నారు. లక్షల్లో అప్పులు పేరుకుపోవడంతో హాస్టల్స్‌ నిర్వహణపై నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోతే హాస్టల్స్‌ నిర్వహించలేక మూతపడే పరిస్థితి నెలకొందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో హాస్టల్‌కు ఒక ఉపాధ్యాయుడు, ఒక కేర్‌ టేకర్, ఇద్దరు వంట మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. ఉపాధ్యాయుడికి, కేర్‌ టేకర్‌కు రూ.3 వేల గౌరవ వేతనం, వంట చేసేవాళ్లకు ఇద్దరికి రూ.3 వేలు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. మూడు నెలలుగా గౌరవ వేతనం మంజూరు చేయలేదు. కష్టపడి పనిచేసినా వచ్చే అరకొర వేతనం సకాలంలో మంజూరు చేయకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.

సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదు
బేస్తవారిపేట మండలంలోని గంటాపురం, ఎంపీ చెరువు గ్రామాల్లో సీజనల్‌ హాస్టల్స్‌ నిర్వహిస్తున్నాం. రెండు హాస్టల్స్‌కు రూ.1.70 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో హాస్టల్స్‌ నిర్వహణ ఎలా చేయాలి. రేషన్‌ షాపుల్లో అప్పులు పేరుకుపోతున్నాయి. – కె.నిర్మలాబాయి, హోత్స్‌ స్వచ్ఛంద సంస్థ, బేస్తవారిపేట

మూడు నెలల నుంచి వేతనం లేదు
జనవరి నెల నుంచి హాస్టల్‌లో వంట చేస్తున్నాను. ప్రభుత్వం ఒక్క నెలకు కూడా గౌరవ వేతనం విడుదల చేయలేదు. ఇచ్చే అరకొర వేతనం కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.    – తిరుపతమ్మ, వంట మనిషి

మరిన్ని వార్తలు