ఒక్కరితో కష్టమే..!

22 Sep, 2019 09:18 IST|Sakshi
కొత్తపేట పాఠశాలలో బోధిస్తున్న ఏకోపాధ్యాయుడు

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సాగని బోధన 

అత్యవసర వేళ సెలవు పెడితే చదువు దూరం 

జిల్లాలో 275 పాఠశాలల్లో ఏకోపాధ్యాయులతోనే బోధన

జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి

ప్రత్నామ్నాయ చర్యలు చేపట్టాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు

సాక్షి, చీపురుపల్లి రూరల్‌: జిల్లాలోని పలు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధన సమస్యగా మారింది. అత్యవసర వేళ ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా... కాస్త ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు చదువుకు దూరంకావాల్సిన పరిస్థితి. జిల్లాలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 378, ప్రాథమికోన్నత పాఠశాలలు 213, ప్రాథమిక పాఠశాలలు 2,160 ఉన్నాయి. వీటిలో సుమారు 275 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. వీటిలో బోధన సమస్యలు షరామామూలయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.  ఒక్క చీపురుపల్లి మండలంలోనే 12 పాఠశాలలు, నియోజకవర్గంలో 25 పాఠశాలలు ఏకోపాధ్యాయుడితోనే నడుస్తుండడం గమనార్హం.

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల బోధనకు, ఉపాధ్యాయుడికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించారు. ఏకోపాధ్యాయుడికి సహాయంగా ఈ బోధకులతో బోధన అందించి విద్యార్థులకు న్యాయం చేసేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ నియామకాలను నిలిపివేసింది. దీంతో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కష్టాలు మొదలయ్యాయి. విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోకపోతే కొన్ని సమయాల్లో విద్యార్థులు విద్యా భోదనకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఇవీ సమస్యలు..
ఒకటి నుంచి ఐదు తరగతులకు కలిపి 18 సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టులను ఒక ఉపాధ్యాయుడే బోధన చేస్తూ మిగతా పనులను కూడా చూసుకోవాల్సి ఉంది. ఉపాధ్యాయుడికి నెలకోమారు సమావేశం ఉంటుంది. వృత్యంతర శిక్షణకు హాజరుకావాలి. ఈ లెక్కన ఏడాదికి 11 సమావేశాలు ఉంటాయి. దీంతో పాటుగా స్కూల్‌ కాంప్లెక్సు సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలుకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలి. ఆడిట్‌ వర్కులు, ఆన్‌లైన్‌ సేవలు సమయాల్లో సెలవులు తీసుకోవాలి. వీటితో పాటుగా ఉపాధ్యాయుడి అవసరాల నిమిత్తం  తమ సెలవులను తీసుకుంటారు. ఇలాంటి సమయాల్లో ఏకోపాధ్యా పాఠశాలలు మూసే యాల్సి పరిస్థితి ఉండడమో.. లేదంటే సమీప దూరంలో ఉన్న వేరే పాఠశాల ఉపాధ్యాయుడిని మండల విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు వేరొకరిని వేయడమో చేస్తుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎంత వరకు అందుతుందన్నది ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా విద్యాశాఖ అ ధికారుల వద్ద ప్రస్తావించగా... ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతున్న మాట వాస్తవమేనని, అయితే... అత్యవసరంగా ఉపాధ్యాయుడు సెలవుపెట్టినప్పుడు సమీప పాఠశాల నుంచి వేరొక్క ఉపాధ్యాయుడుని సర్దుబాటు చేస్తున్నామన్నారు. విద్యాబోధనకు ఆటంకం లేకుండా చూస్తున్నామన్నారు.   

మరిన్ని వార్తలు