విద్యుత్ కోతలు మరింత తీవ్రం

23 May, 2014 02:18 IST|Sakshi
విద్యుత్ కోతలు మరింత తీవ్రం

శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన కారణంగా జిల్లా ప్రజలకు విద్యుత్ కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. శుక్రవారం నుంచే కోతల వాతలు పెరగనున్నాయి. రాష్ట్ర స్థాయి అధికారులకు జిల్లాకు విద్యుత్ కోటాను తగ్గించడమే ఇందుకు కారణం. రోజుకు జిల్లాకు 34 లక్షల యూనిట్ల విద్యుత్ అవసరం కాగా గతంలో 32 లక్షల యూనిట్లు సరఫరా అయ్యేది. డిమాండ్, సరఫరాల మధ్య తేడా 2 లక్షల యూనిట్లు మేర ఉండడంతో జిల్లా ట్రాన్స్‌కో అధికారులు కోతలు విధిస్తూ వస్తున్నారు. లోడ్ రిలీఫ్ పేరిట కూడా కోతలు విధించేవారు.
 
 తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాకు విద్యుత్ కోటాను 28 లక్షల యూనిట్లకు తగ్గించారు. దీంతో డిమాండ్, సరఫరాల మధ్య ఏకంగా 6 లక్షల యూనిట్ల మేర తేడా ఏర్పడింది. ఈ కారణంగా విద్యుత్ కోతలు ఇబ్బడిముబ్బడి కానున్నాయి. వ్యవసాయ కనెక్షన్లు, పరిశ్రమలకు కూడా కోత విధించనున్నారు. 10 జిల్లాల తెలంగాణకు విద్యుత్‌ను ఎక్కువగా కేటాయించిన అధికారులు, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు తగ్గించటంతో ఆ మేరకు జిల్లాలకు కోటా తగ్గించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన వల్ల జిల్లాలకు విద్యుత్ కోటా పెరగవచ్చునని అధికారులు భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
 
జిల్లాలో 70 శాతం మందికిపైగా జనం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగా ఉండగా, ఇప్పుడు కోటా తగ్గడం వల్ల పంటలకు నష్టం తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు. జూన్ 2 తర్వాత పరిస్థితి మారవచ్చునని విద్యుత్ శాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.. పరిస్థితిలో సానుకూల మార్పేమీ ఉండదని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. విద్యుత్ ఉత్పాదన పెరగటం లేదా పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు