వివాదాలు అంతులేకుండా కొనసాగరాదు

28 Mar, 2015 02:28 IST|Sakshi
  • కృష్ణా జలాల వివాదం కేసుల్లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
  • తెలంగాణ, ఏపీ పిటిషన్లపై విచారణ
  • విషయాలు తిరగదోడుతూ వెనక్కి వెళ్లలేం
  • ఎక్కడో ఒకచోట వివాదాలు పూర్తవ్వాలి
  • ఏప్రిల్ 29కి విచారణ వాయిదా
  • సాక్షి, న్యూఢిల్లీ: నదీ జలాల వివాదాలు అంతులేకుండా కొనసాగరాదని, వాటిని పరిష్కరించడం తమ రాజ్యాంగ విధి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన అవార్డును గెజిట్‌లో నోటిఫై చేయరాదంటూ ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్, కృష్ణా నదీ జలాల పంపిణీని నాలుగు రాష్ట్రాలకు తిరిగి చేపట్టాలంటూ కొత్త రాష్ట్రమైన తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్లు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి.

    జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా నదీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ 2010 డిసెంబర్‌లో ఇచ్చిన తీర్పు వల్ల తమకు అన్యాయం జరిగిందని, అది పరిష్కారమయ్యేంత వరకు తీర్పును నోటిఫై చేయరాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గతంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం సైతం తమకు అన్యాయం జరిగిందని, తమ వాదనలు కూడా వినాలని పిటిషన్ దాఖలు చేసింది.

    అలాగే ట్రిబ్యునల్ తీర్పును తక్షణం గెజిట్‌లో ప్రచురించి అమలుచేయాలని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సెల్పీ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లన్నీ శుక్రవారం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి.పంత్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణ కు వచ్చాయి. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నదీ జలాల వివాదాలు ఇలా అంతులేకుండా కొనసాగరాదు. అవార్డు నోటిఫై కానప్పటికీ అందులో ఉన్న విషయం మీ అన్ని రాష్ట్రాలకు తెలుసు..’ అని పేర్కొంది. దీనిపై మహారాష్ట్ర తరఫు న్యాయవాది అంధ్యార్జున తన వాదన వినిపిస్తూ ‘ఇక్కడ వివాదం కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల మధ్యే ఉంది.

    వాళ్లు చివరకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డును కూడా తిరగదోడమంటున్నారు. రాజ్యాంగం ప్రకారం నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పును కోర్టుల్లో సవాలు చేసే వీలు లేదు’ అని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మిశ్రా జోక్యం చేసుకుంటూ ‘ఈ పరిష్కారంపై రాష్ట్రాలకు కమిట్‌మెంట్ ఉండాలి. విషయాలు తిరగదోడుతూ వెనక్కివెళ్లలేం కదా..’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక తరఫు న్యాయవాది నారీమన్ వాదనలు వినిపిస్తూ ‘ఈ విషయంలో మా వాదన కూడా అదే. విచారణ త్వరగా పూర్తవ్వాలి..’ అని పేర్కొన్నారు.

    జస్టిస్ మిశ్రా తిరిగి జోక్యం చేసుకుంటూ తెలంగాణ న్యాయవాది కృష్ణమూర్తి స్వామిని ఉద్దేశించి ‘మీకు ఏపీతో వివాదం ఉండొచ్చు. అలాగే ఏపీకి ఇతర రాష్ట్రాలతో వివాదం ఉండొచ్చు.. కానీ ఎక్కడో ఒకచోట పూర్తవ్వాలి..’ అని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నీటి కేటాయింపులను అన్ని రాష్ట్రాల మధ్య మళ్లీ జరపాల్సి ఉంది..’ అని వివరించబోయారు. వెంటనే జస్టిస్ మిశ్రా జోక్యం చేసుకుని ‘అది మీ ఇద్దరి మధ్య(ఏపీ, తెలంగాణ మధ్య) ఉన్న వివాదం. ముందు ఏపీకి  కేటాయింపులు జరిపారు. ఇప్పుడు ఆ కేటాయింపులను మీరిద్దరూ పంచుకోవాలి.

    ఒకరకంగా అది అంతర్ జిల్లాల పంపకం. అంతేకదా..’ అని పేర్కొన్నారు. ‘ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేసేందుకు మరో రెండు వారాలు గడువిస్తున్నాం. వాటిపై రీజాయిండర్లు దాఖలు చేసుకునేందుకు మరో వారం గడువు ఇస్తున్నాం. మూడు పేజీలకు మించకుండా తమ వైఖరిని రాష్ట్రాలు తెలియపరచాల్సి ఉంటుంది. ఈ గడువుకు పొడిగింపు ఉండదు. విచారణను ఏప్రిల్ 29కి వాయిదావేస్తున్నాం. కోర్టును వాయిదా కోరరాదు. న్యాయవాదులు అందుబాటులో లేనిపక్షంలో ప్రత్యామ్నాయం ఏర్పాటుచేసుకోవాలి..’ అని ఉత్తర్వులు జారీచేశారు.
     
    సిబ్బందిని సమకూర్చడంలో జాప్యంపై కృష్ణా బోర్డు ఆగ్రహం

    రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం మేరకు ఏడు నెలల కింద ఏర్పాటైన తమ బోర్డుకు సిబ్బందిని సమకూర్చడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చేస్తున్న అలక్ష్యంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు కార్యకలాపాల నిర్వహణకు తగిన సిబ్బందిని సమకూర్చాలని చట్టంలోనే పేర్కొన్నా, ఇంతవరకు తమకు సిబ్బందిని కేటాయించకపోవడాన్ని ప్రశ్నించింది. ప్రాజెక్టుల పరిధిలో నీటి పంపిణీ సంక్లిష్టంగా మారుతున్న పరిస్థితుల్లో, బోర్డు సమర్థంగా పనిచేసేందుకు సిబ్బంది, వృత్తి నిపుణుల అవసరం ఎంతైనా ఉందని, దానికి అనుగుణంగా రెండు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లకు, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా లేఖలు రాశారు. ఈ లేఖల ప్రతులను ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులకు సైతం పంపారు. ఏడు నెలల్లో కేవలం డిప్యూటీ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్‌లను మాత్రమే రెండు రాష్ట్రాలు సమకూర్చాయని, ఇది బోర్డు రోజువారీ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. ఈ దృష్ట్యా సూపరింటెండెంట్ ఇంజనీర్‌ను ఏపీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను రెండు రాష్ట్రాలు, అకౌంట్స్ ఆఫీసర్‌ను, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌ను ఇరు రాష్ట్రాలు సమకూర్చాలని కోరారు. అలాగే కార్యాలయానికి అనువైన స్థలాన్ని కూడా చూపాలని కోరారు.

మరిన్ని వార్తలు