జనవరి నుంచి ‘సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌’

27 Oct, 2019 04:10 IST|Sakshi

పకడ్బందీగా లైసెన్సుల జారీ ప్రక్రియ

డ్రైవింగ్‌ టెస్ట్‌ మొత్తం వీడియో రికార్డింగ్‌ 

రాష్ట్రంలో తొమ్మిది చోట్ల అధునాతన ట్రాక్‌ల నిర్మాణం 

టెండర్లు ఖరారు చేసిన రవాణా శాఖ 

ట్రాక్‌ల నిర్మాణానికి కేంద్ర సాయం రూ. 9 కోట్లు   

రూ. 2 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్రం 

సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంగా వచ్చే ఏడాది జనవరి నుంచి డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఇందుకోసం సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆటోమేషన్‌ విధానంలో జరిగే ఈ డ్రైవింగ్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే లైసెన్సు దక్కుతుంది. డ్రైవింగ్‌ టెస్ట్‌ మొత్తం వీడియో రికార్డు ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. వాహనాన్ని సరిగ్గా డ్రైవింగ్‌ చేయకుంటే మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా లైసెన్సు జారీ చేయలేరు. ఆటోమేషన్‌ విధానంలో లైసెన్సుల జారీ ప్రక్రియ గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో అమలవుతోంది. అక్కడ ‘సాఫ్ట్‌’ ట్రాక్‌ల పేరుతో ఈ విధానం అమల్లో ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 

ట్రాక్‌ల నిర్మాణం ఇక్కడే.. 
రాష్ట్రంలో మొత్తం తొమ్మది చోట్ల అధునాతన సైంటిఫిక్‌ టెస్ట్‌ ట్రాక్‌లు నిర్మించడానికి రవాణా శాఖ టెండర్లను ఖరారు చేసింది. ఒక్కో ట్రాక్‌ను రూ. కోటి ఖర్చుతో నిర్మించనున్నారు. కేంద్రం రూ. 9 కోట్లు సాయం చేయనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు వెచ్చించనుంది. విశాఖపట్టణం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురంలలో ఈ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. 

ప్రస్తుతం లైసెన్సుల జారీ ఇలా.. 
ప్రస్తుతం టూ వీలర్, త్రీ వీలర్, హెవీ, ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు నడిపేందుకు లైసెన్సులు పొందాలంటే డ్రైవింగ్‌ ట్రాక్‌లలో మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో వాహనం నడపాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌ పరీక్ష పాస్‌ కాకున్నా మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ లైసెన్సు జారీ చేసే అవకాశం ఉంది. మధ్యవర్తుల ద్వారా అక్రమాలు జరుగుతున్నాయి. 

ఆటోమేషన్‌ విధానంలో ఇలా.. 
అధునాతనంగా ఏర్పాటు చేసే డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లలో సెన్సార్లు, కెమెరాలు బిగించి మొత్తం డ్రైవింగ్‌ పరీక్షను రికార్డ్‌ చేస్తారు. తాము డ్రైవింగ్‌ సరిగ్గా చేసినా.. తమకు లైసెన్సు ఇవ్వలేదని దరఖాస్తుదారులు ఆరోపించడానికి అవకాశం ఉండదు. ఎలాంటి అక్రమాలకు, సిఫార్సులకు, ఆరోపణలకు ఆస్కారం ఉండదు. నిర్దేశిత నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌ చేసిన వారికి లైసెన్సు వస్తుంది. దరఖాస్తుదారుడు కోరితే తన డ్రైవింగ్‌ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డు ఫుటేజీ ఇవ్వనున్నారు.  

ఆరోపణలకు తావుండదు 
రాష్ట్రంలో ఏర్పాటయ్యే 9 ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లకు కేంద్రం  రూ. 9 కోట్లు ఇవ్వనుంది. రూ. 2 కోట్లు టెండర్ల ప్రక్రియకు, రూ. 2.50 కోట్లు టెస్ట్‌ డ్రైవ్‌ ట్రాక్‌లకు వెచ్చించేలా రోడ్‌ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి డ్రైవింగ్‌ శిక్షణా, తనిఖీ మొత్తం ఆటోమేటెడ్‌ విధానం ద్వారానే జరుగుతుంది. ఈ విధానంతో లైసెన్సుల జారీలో ఎలాంటి ఆరోపణలకు వివాదాలకు తావుండదు.
– పీఎస్సార్‌ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్‌  

మరిన్ని వార్తలు