ఆలయం.. తేజోమయం

8 Oct, 2018 13:58 IST|Sakshi
సుందరంగా రూపొందించిన పందిరి (ఇన్‌సెట్‌) పెద్దమ్మ ఆలయం

భక్తుల కొంగు బంగారంగావిరాజిల్లుతున్న అమ్మవారు

ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

దసరా ఉత్సవాల నిర్వహణలో ప్రొద్దుటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనూతనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది... దేవీ శరన్నవరాత్రలను పెద్ద దేవాలయాలతోపాటు చిన్న ఆలయాల వారు వైభ
వంగా నిర్వహిస్తూ ఉత్స వాలకు శోభ తీసుకువస్తున్నారు... ఇందుకోసం 20 రోజులముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు... మరో రెండు రోజుల్లో నవ రాత్రులు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఆలయాల విశిష్టత,అక్కడ చేస్తున్న ఏర్పాట్లపై ‘సాక్షి’ అందిస్తున్నప్రత్యేక కథనం.

ప్రొద్దుటూరు కల్చరల్‌: ప్రొద్దుటూరు రూరల్‌ పరిధి భగత్‌సింగ్‌ కాలనీలోని పెద్దమ్మ ఆలయంలో 8 ఏళ్లుగా శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. పెద్దమ్మ ఆ ప్రాంత వాసులకు, భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందారు. 2007లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంతకుముందు 20 ఏళ్లు పైగా అక్కడ ఉన్న వేప చెట్టుకు పూజలు చేసే వారు. హౌసింగ్‌ బోర్డు, భగత్‌సింగ్‌ కాలనీ ప్రజలు ఆరాధ్యదేవతగా పూజిస్తున్నారు. ఈ ఆలయ కమిటీలో హిందువులతోపాటు ముస్లిం, క్రైస్తవులు కూడా మెం బర్లుగా ఉంటూ.. అమ్మవారిని కొలుస్తూ సేవ చేస్తున్నారు. 2011 నుంచి నవరాత్రులను దాతలు, భక్తుల సహకారంతో కనుల పండువగా నిర్వహిస్తున్నారు. శరణు అన్న వారికి తన అభయ హస్తంతో వెంటనే కష్టాలు, సమస్యలను తొలగించి సుఖశాంతులు, ఆయురారోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించే తల్లిగా విరాజిల్లుతున్నారు. ఏటా ఉగాది, దసరా పర్వదినాలలో, జయంతి ఉత్సవాలలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలతోపాటు జపహోమాదులు, గ్రామోత్సవాన్ని లోకకల్యాణార్థం నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కట్టుకునే పందిరి రూపొందిస్తున్నారు. ఆలయాన్ని సుందరంగా విద్యుత్‌ దీపాలతో అలంకరించడంతోపాటు ఎల్‌ఈడీ భారీ దేవతామూర్తుల ఆర్చీని ఏర్పాటు చేస్తున్నారు.

రోజూ విశేష అలంకారాలు
దసరా ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం అమ్మవారిని విశేషంగా అలంకరిస్తున్నారు. ఈ నెల 10న పెద్దమ్మ, 11న చౌడేశ్వరిదేవి, 12న అన్నపూర్ణ, 13న పార్వతి, 14న గజలక్ష్మి, 15న సరస్వతి, 16న భవానీ, 17న మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. 18న సాయంత్రం పెద్దమ్మతల్లి శమీదర్శనం, చెక్కభజనలు, మంగళవాయిద్యాల మధ్య గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు.

భక్తుల సహకారంతో..
గతేడాది కంటే ఈ ఏడాది దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. దాతలు, భక్తుల సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించాలి.    – దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్‌

వృక్షంలోనే కొలువైన గౌరమ్మ
ప్రొద్దుటూరు కల్చరల్‌ : కొవ్వూరు గ్యారేజి సమీపంలోని గౌరమ్మ ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది. అమ్మవారు వృక్షంలోనే కొలువైనారు. ఆ ఆలయంలో 21 ఏళ్లుగా దసరా ఉత్సవాలను కమనీయంగా నిర్వహిస్తున్నారు. దేవీశరన్నవరాత్రులలో అమ్మవారికి రోజూ ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. వందేళ్ల చరిత్ర గల ఈ గౌరమ్మ చెట్టు కింద పూర్వం అటుగా వెళ్లే ప్రయాణికులు సేద తీరే వాళ్లు. వేప చెట్టును గౌరమ్మతల్లిగా కొలిచే వారు. 30 ఏళ్ల కిందట రొటేరియన్‌ కేటీ రెడ్డి ఇక్కడ ఆలయం నిర్మించారు. అలాగే గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీరామనవమి, వినాయక చవితి, ప్రతి శుక్రవారం, విశేష పర్వదినాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులలో అమ్మవారికి రోజూ విశేష పూజా కార్యక్రమాలు చేయడంతోపాటు గౌరమ్మ చెట్టును వివిధ రూపాలలో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. గౌరమ్మ చెట్టుకే అమ్మవారి వెండి ముఖవర్చస్సు, ఆభరణాలను శోభాయమానంగా అలంకరిస్తారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు.

అలంకారాలు
అమ్మవారిని ఈ నెల 10న రాజరాజేశ్వరి, 11న శారదాదేవి, 12న భవాని, 13న అన్నపూర్ణ, 14న పార్వతి, 15న సరస్వతి, 16న గజలక్ష్మి, 17న మహిషాసురమర్దిని, 18న గౌరమ్మ రూపంలో అలంకరించనున్నారు.

మరిన్ని వార్తలు