ప్రశ్నపత్రం అమ్మేసిన ప్రొఫెసర్‌!?

31 Aug, 2017 08:10 IST|Sakshi
ప్రశ్నపత్రం అమ్మేసిన ప్రొఫెసర్‌!?
ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు
 
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆరు నెలల కిందట నిర్వహించిన అసిస్టెంట్‌ హైడ్రో జియాలజిస్టు పోస్టుల భరీకి రూపొందించిన ప్రశ్నపత్రం విషయంలో అక్రమాలు జరిగినట్లు దాన్ని రూపొందించిన ఓ ప్రొఫెసర్‌ దాన్ని తన విద్యార్థులకు అమ్మినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 21 అసిస్టెంట్‌ హైడ్రో జియాలజిస్టు (గ్రౌండ్‌వాటర్‌ విభాగం) పోస్టుల నియామకానికి ఏపీపీఎస్సీ గతంలో నోటిఫికేషన్‌ విడుదలచేసింది. ఈ పరీక్షలకు గాను ప్రశ్నపత్రం రూపొందించే బాధ్యతను విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగానికి అప్పగించింది. ఈ పరీక్షలను ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించింది.

ఫలితాలను ఏప్రిల్లో విడుదల చేసింది. అభ్యర్థులకు ఇంటర్వ్యూలను మే నెలలో నిర్వహించి జూన్‌లో నియామకాలు జరిపింది. ఈ నియామకాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగానికి చెందిన ఇద్దరు పరిశోధక విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. వీరిలో ఒకరు ఈ పరీక్షకు ప్రశ్నపత్రం రూపొందించినట్టు చెబుతున్న జియాలజీ ప్రొఫెసర్‌ సుబ్బారావు వద్ద స్కాలర్‌ కాగా, మరో విద్యార్థి కూడా అదే విభాగంలో స్కాలరే. వీరికి ఇతర అభ్యర్థులకంటే అత్యధిక మార్కులు రావడంతో ప్రతిభ ఆధారంగా వీరి నియామకాలు చేపట్టినట్టు పేర్కొనడంతో తోటి అభ్యర్థుల్లో అనుమానాలు వెల్లువెత్తాయి. బాధితులు ఏపీపీఎస్సీకి ఫిర్యాదుచేశారు. దీనిపై ఏపీపీఎస్సీ అధికారులు ఇంటెలిజెన్స్‌తో విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఇంటెలిజెన్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. 
మరిన్ని వార్తలు