ఎంబీబీఎస్‌ పరీక్షల్లో ‘వైవా’ దందా

15 Feb, 2017 02:39 IST|Sakshi
ఎంబీబీఎస్‌ పరీక్షల్లో ‘వైవా’ దందా

సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో యథేచ్ఛగా ‘వైవా’ దందా నడుస్తోంది. అడిగినంత ఇవ్వకపోతే వైవా పరీక్షల్లో మార్కులు వెయ్యబోమని ప్రొఫెసర్లు బెదిరిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో వారు అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోందని వాపోతున్నారు. శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో జరుగుతున్న తతంగం తాజాగా ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్‌ చేయాల్సి ఉంటుంది. మంగళవారం పీడియాట్రిక్స్, జనరల్‌ సర్జరీ సబ్జెక్టులకు ప్రాక్టికల్స్‌ జరిగాయి.

పీడియాట్రిక్స్‌లో 40 మార్కులకు థియరీ, 30 మార్కులకు ప్రాక్టికల్స్, 20 మార్కులకు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్, 10 మార్కులకు వైవా జరుగుతుంది. జనరల్‌ సర్జరీలో 60 మార్కులకు థియరీ, 60 మార్కులకు ప్రాక్టికల్స్, మరో 60 మార్కులకు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్, 20 మార్కులకు వైవా ఉంటుంది. వైవా మార్కులు మాత్రమే థియరీ మార్కులకు కలుపుతారు. దీంతో సాధారణంగా వైవాలో ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తుంటారు. వీరి అవసరాన్ని గమనించిన పలువురు ప్రొఫెసర్లు సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. పీడియాట్రిక్స్‌లో 10కి 8 మార్కులేయాలంటే రూ. 3 వేలు, 9 మార్కులేయాలంటే రూ.4వేలు వసూలు చేశారు. జనరల్‌ సర్జరీలోనూ 20కి 16 మార్కుల నుంచి బేరాలు నడిచాయి. ఇందులోనూ రూ.4వేల నుంచి రూ.6 వేల వరకూ వసూలు చేశారు. ఈ పరిస్థితి ఒక్క రిమ్స్‌లోనే కాదు, అన్ని వైద్య కళాశాలల్లో ఉందని విద్యార్థులు వాపోయారు.

కొందరికింకా ఆ జాడ్యం పోలేదు
కాగా, దీనిపై వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ ఎన్‌. సుబ్బారావు స్పందిస్తూ.. కొందరు ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ఇంకా వసూళ్ల జాడ్యం పోలేదన్నారు. ఈ ఉదంతంపై విచారణ జరిపించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు