వికేంద్రీకరణతోనే ప్రగతి పరుగులు

29 Jan, 2020 06:23 IST|Sakshi
కడపలో ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద విద్యార్థుల ప్రదర్శన

ఒక రాజధాని వద్దు.. సమగ్రాభివృద్ధే ముద్దంటూ నినదించిన విద్యార్థులు

సర్కారు నిర్ణయానికి బాసటగా నిలిచిన ప్రొఫెసర్లు

యూనివర్సిటీలు, కళాశాలల్లో సదస్సులు

పల్లెల్లోకూ పాకిన ప్రదర్శనలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు కావాలని విద్యార్థి లోకం నినదించింది. ఆ దిశగా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర అసెంబ్లీకి జేజేలు పలికింది. మరోవైపు పాలన వికేంద్రీకరణతోనే ప్రగతి పరుగులు పెడుతుందని ప్రొఫెసర్లు గళమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థుల ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించి పాలన వికేంద్రీకరణకు మద్దతు పలకగా.. సదస్సులు నిర్వహించి ప్రొఫెసర్లు వికేంద్రీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను ఎలుగెత్తి చాటారు.
– సాక్షి నెట్‌వర్క్‌

అభివృద్ధి విస్తరిస్తేనే సమన్యాయం
పాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ కళాశాలల్లో మంగళవారం సదస్సులు నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని సంహిత కళాశాలలో ‘రాష్ట్రాభివృద్ధి–వికేంద్రీకరణ–పాలన’ అంశాలపై నిర్వహించిన సదస్సులో వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా అధికార వికేంద్రీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ రూరల్‌ కో–ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్‌)లో యువజన విభాగం ఆధ్వర్యంలో  ‘పాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటుతో కలిగే అభివృద్ధి, ఒనగూరే ప్రయోజనాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.  డైట్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఆర్‌జేడీ రాజు తదితరులు పాల్గొన్నారు.

మేధావుల నోట అదే మాట
అనంతపురంలోని జేఎన్‌టీయూలో నిర్వహించిన సదస్సుకు మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు హాజరై వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతించారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్‌ పీడబ్ల్యూ పురుషోత్తం, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు ఆలూరి రామిరెడ్డి విద్యార్థులకు వివరించారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాయలసీమతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రొఫెసర్లు, అధ్యాపకులు, మేధావులు పేర్కొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ బ్లాక్‌ ఆడిటోరియంలో మంగళవారం ‘నిధులు, నీళ్లు, నియామకాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న చర్యలకు మద్దతు ప్రకటిస్తూ.. పాలన వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు  వైఖరిని ఎండగట్టారు.

ఎస్వీయూ రిటైర్ట్‌ ప్రొఫెసర్‌ దేవిరెడ్డి సుబ్రహ్యణ్యంరెడ్డి, ఎ.రంగారెడ్డి, ఎస్వీయూ అధ్యాపక సంఘం కార్యదర్శి రెడ్డి భాస్కర్‌రెడ్డి, మేనేజ్‌మెంట్‌ ప్రొఫెసర్‌ సర్దార్‌ గూగ్లోత్‌ పాల్గొన్నారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ సెనెట్‌ హాల్‌లో మూడు రాజధానుల ఏర్పాటు, పాలన వికేంద్రీకణ వల్ల కలిగే ప్రయోజనాలపై చర్చించారు. రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్‌ ఎం.పురుషోత్తం రెడ్డి, సొదుం రమణ, నర్మద, ఆదిమూలం శేఖర్, అధ్యాపకులు వైఎస్‌ శారద, ఉమామహేశ్వరి, కళారాణి, సంధ్యా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆప్స్‌ అధ్యక్షుడు ఎన్‌.రాజారెడ్డి పాల్గొన్నారు. ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అని కడప విద్యార్థులు నినదించారు. పాలన వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంగళవారం కడపలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద వైఎస్సార్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన జరిపారు. 

వికేంద్రీకరణతోనే సర్వతోముఖాభివృద్ధి
వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయని ప్రొఫెసర్లు స్పష్టం చేశారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ టీఎల్‌ఎన్‌ మీటింగ్‌ హాల్‌లో ‘వికేంద్రీకరణ–అభివృద్ధి’ అనే అంశంపై మంగళవారం సదస్సు జరిగింది. ప్రొఫెసర్లు మాట్లాడుతూ.. తరతరాలుగా వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. సదస్సులో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కె.రవి, ప్రొఫెసర్లు కె.వెంకటరావు, కె.షారోన్‌రాజు, కె.జాన్, పేటేటి ప్రేమానందం, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.

విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ‘రాష్ట్ర సమగ్రాభివృద్ధి’ అనే అంశంపై విద్యార్థులతో నిర్వహించిన సదస్సులో వక్తలు మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ స్వార్థ ప్రయోజనాల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు,  యువజన నాయకులు అల్లు చాణక్య, జీవీ రంగారావు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో ‘అభివృద్ధి వికేంద్రీకరణ–మూడు రాజధానులు’ అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు.  ఎచ్చెర్ల పారిశ్రామిక శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ కైలాసరావు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మెంటాడ వెంకట స్వరూప్, జిల్లా ఎన్జీవోల సంఘ అధ్యక్షుడు హనుమంతు సాయిరాం పాల్గొన్నారు.

పల్లెలకూ పాకిన ప్రదర్శనలు
పాలన వికేంద్రీకరణను సమర్ధిస్తూ పశ్చిమగోదావరి జిల్లాలోని బంగారుగూడెం, వీరంపాలెం, పట్టెంపాలెం మీదుగా తాడేపల్లిగూడెం వరకు యువకులు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకూ అందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు కావాలని నినదించారు.

మరిన్ని వార్తలు