అనాథ పిల్లలతో కళా వ్యాపారం?

31 May, 2018 07:44 IST|Sakshi
కోర్టులో గంగమ్మ జాతర సందర్భంగా చెక్కభజనలు చేస్తున్న పిల్లలు (ఫైల్‌)

ధనార్జనే ధ్యేయంగా వేకువజాము వరకు కోలాటాలు, చెక్క భజనలు

అనాథప్లిలల ఆరోగ్యంతో నిర్వాహకుడి చెలగాటం

మదనపల్లె టౌన్‌ : తల్లిదండ్రులు లేని పిల్లలను అక్కున చేర్చుకుంటున్నట్టు చూపిస్తూ వారితో వ్యాపారం చేస్తున్నారు. కళను అడ్డుపెట్టుకుని అనాథల సేవ ముసుగులో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే పసిపిల్లలను రోజూ ఏదో ఒక ప్రాంతంలో జరిగే జాతరలు, కార్యక్రమాలకు తీసుకెళ్లి సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారుజాము వరకు కోలా టాలు, చెక్క భజనలు చేయిస్తున్నారు. ఇందుకు గాను నిర్వాహకుల నుంచి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు తీసుకుంటున్నట్టు తెలిసింది. రాత్రంతా ప్రదర్శన కారణంగా పిల్లలు నిద్రలేమితో అనారోగ్యంతో బాధపడుతూ చదువులు కొనసాగించలేకపోతున్నారు. అనాథలైన పిల్లలు తమకు అన్నం పెట్టే యజమానిని ఎదిరించలేక వారి ధనార్జనకు పావులుగా మారుతున్నారు.

మదనపల్లె పట్టణం బర్మా వీధిలో ఒక వ్యక్తి 15 ఏళ్లుగా అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇక్కడ సుమారు 70 మందికి పైగా 2 నుంచి 18 ఏళ్లలోపు అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమ నిర్వహణకు మదనపల్లెతోపాటు రూరల్‌లోని పలువురు దాతలు విరాళాలతోపాటు విద్యకు సంబంధించి సామగ్రి, దుస్తులు ఇస్తున్నారు. అలాగే పౌష్టికాహారాన్ని సరాఫరా చేస్తున్నారు. అవి పిల్లలకు అందడం లేదు. నిర్వాహకుడు అవి చాలలేదని పేర్కొంటూ రూ.వేలకు వేలు ఒప్పందం కుదుర్చుకుని పిల్లలతో రాత్రిళ్లు కోలాటాలు, చెక్క భజనలు చేయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అనాథ ఆశ్రమంలో పిల్లలకు సేవ చేస్తున్నట్టు అధికారులను, స్థానికులను నమ్మిస్తూ ధనాన్ని ఆర్జిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా తన స్వార్థ ప్రయోజనానికి సేవ ముసుగు తొడిగాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలా చేస్తున్నట్టు చెబుతున్నారు.

వారం రోజులుగా కోలాటాలు, చెక్క భజనలు
మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగ జాతర సందర్భంగా వారం రోజుల నుంచి పిల్లలు రాత్రిళ్లు కోలాటాలు, చెక్క భజనలు చేశారు. మంగళవారం రాత్రి కదిరి రోడ్డులో ఉన్న అమ్మచెరువుమిట్టపై జరిగిన గంగజాతరలోనూ రికార్డు డ్యా న్సు చేశారు. వారికి విశ్రాంతి ఇవ్వకుండా బుధవారం రాత్రి మళ్లీ రాయచోటిలో జరుగుతున్న జాతరలో చెక్కభజనలు, కోలాటాల కోసం పంపించారు. ఇంత జరుగుతున్నా సీడీపీవోగాని, చైల్డ్‌ కమిషన్‌ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమం పేరుతో జరుగుతున్న కళావ్యాపారంపై కొన్ని స్వచ్ఛంద సంస్థలు కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిసింది. దీనిపై ఆశ్రమ నిర్వాహకుడిని వివరణ కోరగా ఆశ్రమంలో 70 మంది పిల్లలు ఉన్నారని తెలి పారు. వారికి విద్య సామగ్రితోపాటు దుస్తులు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. అంతేగాక భోజనాలు కూడా సమకూర్చేందుకు డబ్బు సరిపోకపోవడం లేదని, అందువల్లే చెక్క భజన లు, కోలాటాలు చేయిస్తున్నామని తెలిపారు. వ్యాపారం కోసం కాకుండా పిల్లలను సాకేందుకే ఇలా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ఎస్పీకి ఫిర్యాదు
పిల్లలకు విశ్రాంతి లేకుండా కళల పేరుతో పిల్లలతో వ్యాపారం చేస్తున్న ఆశ్రమ నిర్వాహకుడిపై చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. కలెక్టర్‌కు లేఖ రాశాం. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. – అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు