అభివృద్ధి వ్యతిరేకి చంద్రబాబు

16 Feb, 2020 05:08 IST|Sakshi
ప్రకాశం జిల్లా గిద్దలూరులో వంటావార్పును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు

వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రమంతటా కార్యక్రమాలు

చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతులు

మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు జరిగాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు అభివృద్ధి వ్యతిరేకిగా మారటాన్ని నిరసిస్తూ.. అయనకు సద్బుద్ధి ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. పాలన, అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తాయని ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళలు నినదించారు.
– సాక్షి నెట్‌వర్క్‌

మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా అనంతపురం జిల్లా మడకశిర, కళ్యాణదుర్గం, హిందూపురం, అనంతపురం పట్టణాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. మడకశిరలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే తిప్పేస్వామి హాజరై సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, ఆదోని, నందికొట్కూరు, పత్తికొండ, నంద్యాల నియోజకవర్గాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

‘తూర్పు’న పాదయాత్ర
శాసన మండలిలో బలగాన్ని ఉపయోగించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డ తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జ్ఞానోదయం కల్పించి రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా అంతటా వివిధ సంఘాలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాయి. అమలాపురంలో విద్యార్థులు పాదయాత్ర నిర్వహించి, అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం, కొత్తపల్లి మండలం యండపల్లి జంక్షన్, రామచంద్రపురం, మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం, రాజమహేంద్రవరం రూరల్‌ కాతేరు, బొమ్మూరు, తుని, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేసి అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, పెండెం దొరబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ హాజరై సంఘీభావం తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా నడచుకోవటాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. 
తిరుపతిలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు 

ఉత్తరాంధ్రలో..
విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురం, విజయనగరం, శృంగవరపుకోట, బొబ్బిలి, నెల్లిమర్లలో అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, రాజాం నియోజకవర్గాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ యూనివర్సిటీలోనూ ఈ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ నగరం, ఆంధ్రా వర్సిటీ, గాజువాక తదితర ప్రాంతాల్లో వికేంద్రీకరణకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతులు సమర్పించారు.

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో..
గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు, గుంటూరులో శనివారం ప్రదర్శనలు నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలిచ్చారు. ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, మద్దాళి గిరి, వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో చేపట్టిన రిలే దీక్షలు శనివారం 11వ రోజుకు చేరాయి. వంటావార్పు కార్యక్రమం నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేశారు. ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హాజరై సంఘీభావం తెలిపారు. కొండపి, చీరాలలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించారు.

ప్రొద్దుటూరులో థాంక్యూ సీఎం సార్‌ ర్యాలీ
ప్రొద్దుటూరు: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో శనివారం మాలమహానాడు ఆధ్వర్యంలో ‘థాంక్యూ సీఎం సార్‌’ అంటూ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి వికేంద్రీకరణ, 
3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ, మాలమహానాడు నాయకులు పాల్గొన్నారు.
థాంక్యూ సీఎం సార్‌ అంటూ ర్యాలీ నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ  

మరిన్ని వార్తలు