ప్రగతి ‘రైలు’.. పట్టాలెక్కేనా..!?

8 Jul, 2014 02:58 IST|Sakshi
ప్రగతి ‘రైలు’.. పట్టాలెక్కేనా..!?
  •      నేడు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి సదానందగౌడ
  •      నత్తనడకన శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగళూరు రైల్వే మార్గాలు
  •      తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ఊపు
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజానీకం పెట్టుకున్న కొండంత ఆశలను మంత్రి సదానందగౌడ సాకారం చేస్తారా? గత రైల్వే మంత్రుల తరహాలోనే వమ్ము చేస్తారా? అన్నది కొద్ది గంటల్లో వెల్లడి కానుంది.

    రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటున్న నేపథ్యంలో మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది. విభజన నేపథ్యంలో రాష్ట్ర, రైల్వేశాఖ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టులకు రైల్వేశాఖే నిధులను సమకూర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను కేంద్రం ఏ మేరకు అంగీకరిస్తుందన్నది నేడు తేలిపోనుంది. వివరాల్లోకి వెళితే..
     
    నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్‌సభలో 2014-15 (పూర్తి స్థాయి) రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కానీ.. జిల్లాలో  రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇందులో ప్రధానమైన రైల్వే మార్గాల పరిస్థితి అంతంత మాత్రమే. ఇదే జిల్లా పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతంగా మారింది.

    అపార ఖనిజ సంపదకూ.. వ్యవసాయ ఉత్పత్తులకు.. పర్యాటక రంగానికి పెట్టింది పేరైన జిల్లా, అభివృద్ధిలో మాత్రం అథమ స్థానంలో ఉండటానికి ప్రధాన కారణం రైల్వే మార్గాలు సక్రమంగా లేకపోవడమేనని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పశ్చిమ మండలాల్లో పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసేలా కడప-మదనపల్లె-బంగారుపేట-బెంగళూరు రైల్వే మార్గాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించారు. తూర్పు మండలాల సమగ్రాభివృద్ధికి దోహదం చేసేలా శ్రీకాళహస్తి-నడికుడి మార్గాన్ని మంజూరు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.
     
    వాటా నిధుల కేటాయింపే సాకుగా...
     
    నిధుల లభ్యత లేదనే సాకు చూపి ఆ రెండు రైల్వే మార్గాలను మంజూరు చేసేందుకు అప్పట్లో రైల్వేశాఖ అంగీకరించలేదు. దీంతో ఆ మార్గాలకు అయ్యే వ్యయంలో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అప్పట్లో వైఎస్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 2008-09 రైల్వే బడ్జెట్లో ఆ రెండు మార్గాలను మంజూరు చేసింది.

    2008-09, 2009-10 బడ్జెట్లలో దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆ రెండు రైల్వే మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా నిధులను ఇచ్చారు. ఫలితంగా కడప-బెంగళూరు, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే మార్గాల పనులను కేంద్రం ప్రారంభించింది. ప్రస్తుతం కడప-బెంగళూరు రైల్వే మార్గం పనులు రూ.129 కోట్ల వ్యయంతో కడప నుంచి పెండ్లిమర్రి వరకూ 21.59 కి.మీల మేర సాగుతున్నాయి. శ్రీకాళహస్తి-నడికుడి రైల్వేమార్గం సర్వే పనులు 2010 నాటికే పూర్తయ్యాయి. పనులు మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. ఐదేళ్లలో పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టులు ఎన్నటికి పూర్తవుతాయన్నది రైల్వేశాఖే ఓ అంచనాకు రాలేకపోతోంది.
     
    దీనికి ప్రధాన కారణం వైఎస్ హఠాన్మరణం తర్వాత శ్రీకాళహస్తి-నడికుడి, బెంగళూరు-కడప రైల్వే మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడదల చేయకపోవడమే. ఇదే సాకుగా చూపి రైల్వేశాఖ కూడా ఆ మార్గాలకు నిధులు కేటాయించడం లేదు. ఈ నేపథ్యంలో సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు రైల్వేశాఖే నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కోరడం గమనార్హం.
     
    డివిజన్ పోయి జోన్ వచ్చె..

     
    గుంతకల్లు డివిజన్, గుంటూరు డివిజన్‌లో కొన్ని భాగాలను వేరు చేసి.. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రెండు దశబ్దాలుగా విన్పిస్తూనే ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికీ, రైల్వేశాఖకూ రాజకీయ, పారిశ్రామిక వర్గాలు ప్రతిపాదనలు కూడా పంపాయి. మంగళవారం రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత రానుంది.
     

మరిన్ని వార్తలు