పక్కాగా అమృతహస్తం

20 Jul, 2014 02:27 IST|Sakshi
పక్కాగా అమృతహస్తం
  • మాతా శిశు మరణాలను నిరోధించాలి
  •  క్షేత్రస్థాయిలోఅధికారుల పర్యటనలు తప్పనిసరి
  •  జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆదేశం
  • పాడేరు: ఏజెన్సీలో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని పక్కాగా అమలు చేసి పౌష్టికాహార సమస్య పరిష్కారంతోపాటు మాతా శిశు మరణాల నిరోధానికి అధికారులంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆదేశించారు. కలెక్టర్‌గా తొలిసారి ఏజెన్సీకి వచ్చిన ఆయన స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమానికి చేపడుతున్న పథకాలపై శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా సమీక్షించారు.

    గిరిజన విద్య, వైద్యం, ఇంజినీరింగ్ పనులు, జీసీసీ, ఉపాధి హామీ పథకం, తాగునీటి సరఫరా,విద్యుత్‌శాఖలవారీ జిల్లా స్థాయి అధికారులతో చర్చించారు. చేపడుతున్న కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మన్యంలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలన్నారు.

    జిల్లాస్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలను గిరిజనుల దరి చేర్చాలన్నారు. మారుమూల గూడేల్లోని అన్ని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకొని మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలన్నారు. ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ మాట్లాడుతూ ఏజెన్సీలోని 5.5 లక్షల మంది గిరిజనుల సంక్షేమానికి ఐటీడీఏ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.

    వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేశామన్నారు. వారపుసంతల్లో ప్రత్యేక వైద్యశిబిరాల ద్వారా 10 వేల మంది గిరిజనులకు ఉన్నత సేవలు అందించామన్నారు. 364 వైద్యశిబిరాలను గ్రామాల్లో నిర్వహించామన్నారు. 29,325 మంది గిరిజన విద్యార్థులకు వైద్యపరీక్షలు జరిపామన్నారు. ఏజెన్సీలోని 67 శాతం ఆస్పత్రి ప్రసవాలు జరుగుతున్నాయన్నారు.

    గిరిజన రైతులకు ఆర్థిక ఆసరా కల్పించాలన్న లక్ష్యంతో కాఫీ సాగును ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఈ ఏడాది మరో 9 వేల ఎకరాల్లో కాఫీ తోటలను చేపడుతున్నామన్నారు. ఆర్డీఓ రాజకుమారి, ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికార్జునరెడ్డి, డీఎంహెచ్‌ఓ శ్యామల, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ కాంతనాధ్, ఈఈ రమణమూర్తి, డ్వామా పీడీ శ్రీరాములు నాయుడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు