ప్రవక్త మార్గం..అనుసరణీయం

5 Jan, 2015 03:32 IST|Sakshi
ప్రవక్త మార్గం..అనుసరణీయం

కర్నూలు ఓల్డ్‌సిటీ: ఇస్లాం పవిత్రతను మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి చాటిచెప్పారని, శాంతి, సామరస్యాలతో జీవనం సాగించాలని ఉద్బోధించారని, ఆయన మార్గం అనుసరణీయమైనది కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ పండగను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. మిలాద్ కమిటీ అధ్యక్షుడు బి.ఇంతియాజ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో భారీ ఊరేగింపు (మిలాద్ జులూస్) నిర్వహించారు.

నగరంలోని పలు వీధుల నుంచి బయలుదేరిన మిలాద్ జులూస్‌లు కూడా స్థానిక రాజ్‌విహార్ సెంటర్‌లో కలుసుకున్నాయి. రాజ్‌విహార్ సెంటర్‌లోని జుల్ఫీషా, చందేషా దర్గాలో మిలాద్ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. లతీఫ్ లావుబాలీ దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా అబ్దుల్లా హుసేని బాద్‌షా ఖాద్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ బుట్టా రేణుకతో పాటు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ మెంబర్ హఫీజ్ ఖాన్, మైనారిటీ నాయకులు బి.జహీర్‌అహ్మద్‌ఖాన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్‌అలీఖాన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. రంజాన్ నెలలో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉండటం, పేదలకు దానం చేసి పుణ్యం కట్టుకోవడం వంటి సత్కర్యాలు అభినందనీయమన్నారు. రంజాన్ నెల నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని, ఇందులో మాటలతో కాకుండా చేతలతో చూపించే తత్వం ఉందన్నారు. ఇక్కడి హిందూ ముస్లింల మధ్య మంచి వాతావరణం ఉందని, ఈ ప్రాంతపు ఎంపీ కావడం తన అదృష్టమని  బుట్టారేణుక పేర్కొన్నారు. అనంతరం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ..  

యుద్ధంలో సైతం నీతిని పాటించిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అని, ఆయన దువా సౌభాగ్యం కలగడాన్ని ఆదమ్ అలై సలాం కూడా గర్వించారని తెలిపారు. ప్రతి ముస్లిం ఆయన చూపిన మార్గంలో నడుచుకోవాలన్నారు. అసలైన ముస్లింలు హాని తలపెట్టరని, ఉగ్రవాదం వేరు, ఇస్లాం వేరని, ఉగ్రవాదాన్ని ముస్లింలకే అంటగట్టడం చాలా తప్పు అని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ ఏమతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, ఇస్లాం మతస్తులు ఉగ్రవాదులు కారని, అలాంటి అభిప్రాయం తప్పని తెలిపారు.

ప్రవక్త శాంతినే కాంక్షించారని, ఆయన చూపిన మార్గంలో ముస్లింలు నడుచుకోవాలని సూచించారు. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలని, ఇలాంటి సంప్రదాయం కర్నూలులో ఉండటం అదృష్టమని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు.  కార్యక్రమంలో లావుబాలీ దర్గా సజ్జాదే నషీన్ ఆరిఫ్ పాషా ఖాద్రి, అహ్లె సున్నత్ జమాత్  జిల్లా అధ్యక్షుడు షఫిబాష ఖాద్రి, రోజా దర్గా పీఠాధిపతులు అన్వర్‌బాష ఖాద్రి, సయ్యద్ మాసుంపీర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు