వక్ఫ్ బోర్డు ఆస్తులపై విచారణ చేస్తాం

7 Dec, 2013 06:06 IST|Sakshi

 తాడిపత్రి, న్యూస్‌లైన్: స్థానిక వక్ఫ్‌బోర్డు ఆస్తుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ  రెండు రోజులుగా వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకుడు మున్నా చేస్తున్న నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. తహశీల్దార్ రామకృష్ణారెడ్డి శిబిరం వద్దకు చేరుకుని ఆయనతో మాట్లాడారు. జరిగిన అక్రమాలపై కలెక్టర్, ఆర్డీవోలకు నివేదిక పంపుతామన్నారు. పూర్తి విచారణ చేపడతామని హామీ ఇస్తూ మున్నాకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపు చేశారు. అంతకు ముందు మున్నా మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల్లో రూ.కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఆధారాలతోసహా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు విచారణకు ఆదేశించినా అమలుకాలేదన్నారు.   కమిటీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.  

వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, తాడిపత్రి నియోజర వర్గ సమన్వయకర్త వి.ఆర్.రామిరెడ్డి, సీఈసీ సభ్యుడు పైలానరసింహయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరంనాగిరెడ్డి, తదితర నాయకులు మున్నాను పరామర్శించిన వారిలో ఉన్నారు. శిబిరంలో వైఎస్సార్‌సీపీ కార్మిక విభాగం ఉపాధ్యక్షుడు వెంకటేశ్, బండామసీదు ముత వల్లీ జిలాన్‌బాషా, మైనార్టీ నాయకులు రహాంతుల్లా, ఆయాబ్, ముష్కిన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
 ‘వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడండి’
  తాడిపత్రి టౌన్:   పట్టణంలోని   వక్ఫ్ బోర్డు ఆస్తులను  పరిరక్షించాలని బీజేపీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు  ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  పట్టణంలో అధికార పార్టీ నాయకుల అండతో అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను కాపాడాలన్నారు. ఇందుకు బాధ్యులైనవారిపై చర్య తీసుకోవాలని కలెక్టర్‌ను కోరనున్నామన్నారు.

మరిన్ని వార్తలు