తిరుమలలో అన్యమత ప్రచారం

30 Oct, 2014 02:16 IST|Sakshi
తిరుమలలో అన్యమత ప్రచారం

తీవ్రంగా పరిగణించిన టీటీడీ ఆరుగురిపై కేసు

తిరుమల: తిరుమలలో మళ్లీ అన్యమత ప్రచారం కలకలం రేపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల ముందు అన్యమతానికి చెందిన ఆరుగురు సాక్షాత్తు శ్రీవారి ఆలయం వద్ద అన్యమత ప్రచారం చేసి, ప్రార్థనలు చేసి, తిరిగి వాటిని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించింది. 1987 రాష్ట్ర దేవాదాయశాఖ చట్ట ప్రకారం తిరుమల పరిధిలో అన్యమత ప్రచారం నిషేధం. ఇందుకు విరుద్ధంగా అమెరికాకు చెందిన ‘ఫెయిత్ ఇంటర్నేషనల్ పార్టనర్స్’ అన్యమత సంస్థ జాతీయ డెరైక్టర్ అయిన సుధీర్ మొండితోక ఇక్కడ ప్రార్థనలు చేసి మతప్రచారం చేశారు. కర్టాటకకు చెందిన ఆయన హైదరాబాద్ కేంద్రంగా అన్యమత సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలో గత నెల మూడోవారంలో ఆరుగురు అన్యమతస్తులు ఏపీ16బిఎన్ 0568 కారులో తిరుమలకు బయలదేరారు. రెండో ఘాట్‌రోడ్డులో ప్రార్థనలు, శ్రీవారి ఆలయ అఖిలాండం వద్ద అన్యమత ప్రచారం చేశారు. పక్కనే వెళ్లే శ్రీవారి భక్తులను చూపిస్తూ మూఢులుగా అభివర్ణించారు. వారి పర్యటనంతా సుమారు 18 నిమిషాల నిడివితో చిత్రీకరించిన వీడియో దృశ్యాలను యూట్యూబ్‌లో పెట్టారు.

విచారణకు మంత్రి ఆదేశం

అన్యమత ప్రచారంపై పోలీసు విచారణకు ఆదేశించనున్నట్టు ఏపీ దేవాదాయ మంత్రి పి.మాణిక్యాలరావు చెప్పారు. ఇందులో టీటీడీ సిబ్బంది వైఫల్యం కొటొచ్చినట్టు కనిపిస్తోందని చెప్పారు. ఈ ఘటనకు కొందరు సిబ్బంది లాలూచీ పడడమే కారణమన్న అనుమానం ఉందన్నారు.

 చర్యలు తీసుకుంటాం: ఈవో

 తిరుమలలో అన్యమత ప్రచారం ఘటనలపై విచారణకు ఆదేశించామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ బుధవారం మీడియాకు వెల్లడించారు. కాగా అన్యమత ప్రచారంలో పాల్గొన్నవారిలో సుధీర్, సుకుమార్, డేవిడ్, జోసఫ్ మరో ఇద్దరున్నట్టు గుర్తించామని టీటీడీ అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి తెలిపారు. వారిపై మూడు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు