-

బోరుబావిలో పడిన చిన్నారులను రక్షించే పరికరం

24 Oct, 2013 01:39 IST|Sakshi

పరిగి, న్యూస్‌లైన్: బోరు బావుల్లో పొరపాటున పడిపోయిన చిన్నారులను రక్షించేందుకు తోడ్పడే.. అద్భుతమైన పరికరాన్ని రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన రామకృష్ణ అనే విద్యార్థి రూపొందించారు. దీని సహాయంతో బోరు బావిలో పడిన చిన్నారి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు... మరింత కిందికి జారిపోకుండా చూడవచ్చు. మొత్తంగా గంటలోపే చిన్నారులను బోరుబావి నుంచి బయటకు తీసేందుకు ఈ పరికరం తోడ్పడుతుంది. రామకృష్ణ పరిగిలోని శిశుమందిర్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అతను తయారు చేసిన ఈ పరికరం ఈ నెల 26, 27 తేదీల్లో కర్ణాటకలోని మంగళూర్‌లో జరిగే అంతర్రాష్ట్ర ప్రదర్శనలో ప్రదర్శనకు ఎంపికైంది.
 
 ఇలా పనిచేస్తుంది..: రామకృష్ణ రూపొందించిన పరికరం బోరుబావిలో పట్టే విధంగా అరమీటరు పొడవు ఇనుప చువ్వలతో ఉంటుంది. దీని అడుగు భాగంలో మూడు ఇనుప ప్లేట్లు ఉంటాయి. ఈ పరికరం బోరుబావిలో పడిన చిన్నారి పక్క నుంచి అడుగు భాగానికి చేరుకోగానే.. ప్లేట్లకు అమర్చిన తీగలను లాగుతారు. దాంతో ప్లేట్లు అడ్డుగా మూసుకుని చిన్నారులు మరింత కిందికి జారకుండా ఉంటారు. ఇక పరికరానికి పైభాగంలో అమర్చిన లైట్, వెబ్ కెమెరా ద్వారా కంప్యూటర్‌లో చిన్నారి పరిస్థితిని గమనించవచ్చు. ఇదంతా ఘటనా స్థలానికి చేరుకున్న పది నిమిషాల్లోనే జరిగిపోతుంది. మొత్తంగా ఒక గంటలోపు బోరుబావిలో పడిన చిన్నారిని బయటకు తీయవచ్చు. రామకృష్ణ బోరు బావి ఆకారంలో ఉన్న ఓ పరికరంలో ఈ ప్రయోగం చేసి చూపించారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే ఈ పరికరాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని చెబుతున్నాడు.

మరిన్ని వార్తలు