అటవీ భూములను రక్షించండి

4 Nov, 2016 02:37 IST|Sakshi

- పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదన
- ఎన్జీటీలో అమరావతి నిర్మాణంపై విచారణ
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం సహజ వనరుల వినాశనానికి పాల్పడుతోందని, అటవీ భూములను, నీటి కుంటలనుసైతం వదలడంలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో రాజధాని నిర్మాణంపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి అమరావతిని ప్రభుత్వం ఎంచుకోవడాన్ని సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కూడా విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ పరిఖ్ వాదనలు వినిపిస్తూ.. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 251 ఎకరాల అటవీ భూమిని సేకరించడానికి ప్రయత్నిస్తోందని, అలాగే 497 ఎకరాల్లో సహజసిద్ధంగా ఏర్పడిన నీటి కుంటల్లో కూడా నిర్మాణాలు చేపట్టాలని ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. వీటిని పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిత్తడి నేలలు ఉన్న అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరిగితే కొండవీటి వాగు, కృష్ణా నది నాశనం అవుతాయన్నారు. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని, రాజధాని నిర్మాణంపై స్టే ఇవ్వాలని కోరారు.

 విచారణ నేటికి వాయిదా..
 ధర్మాసనం స్పందిస్తూ.. ఇప్పటి దాకా పిటిషనర్ల్లు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందన తెలపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ‘‘ఏటా మూడు పంటలు పండే ప్రాంతంలో ప్రభుత్వం రాజధాని నిర్మిస్తోందనేది స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు ఏంటి?. భూములు కోల్పోయే రైతులకు పరిహారం ఏ విధంగా చెల్లిస్తారు. కొండవీటి వాగు ప్రవా హ దిశ మార్పు అభ్యంతరాలపై సమాధాన మేమిటి?, 10-15 మీటర్లలో భూగర్భ జలా లు లభించే ప్రాంతంలో అభివృద్ధి పేరిటి చేపడుతున్న ఇసుక మైనింగ్‌పై మీ వివరణ ఏమిటి?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వీటన్నింటికీ సమాధానం కోరుతూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు