ప్రభుత్వ భూములను కాపాడాలి

26 Sep, 2013 03:48 IST|Sakshi

కలెక్టరేట్, న్యూస్‌లైన్ :ఆక్రమణల నుంచి ప్రభుత్వ భూములను కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్ర రెవన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం ఆయన సీసీఎల్‌ఏ ఐవైఆర్ కృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే కబ్జాకు గురైన భూములను పోలీసు రక్షణతో స్వాధీనం చేసుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని సూచించారు. ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టాలని తెలిపారు. రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులు క్రమం తప్పకుండా వీఆర్వో కార్యాలయాలను తనిఖీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డెప్యూటీ కలెక్టర్, డెప్యూటీ తహశీల్దార్, వీఆర్వో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కలెక్టర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ కబ్జాకు గురైన భూములను గుర్తించి వాటి స్వాధీనానికి చర్యలు చేపట్టామన్నారు. ఆదిలాబాద్ మండలం బట్టిసావర్గంలో కబ్జాకు గురైన 120 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని, మున్సిపల్ ఏరియాలో 1,462, మండలాల్లో 2,032  ఎకరాలు ప్రభుత్వ భూమి గుర్తించామని తెలిపారు. వీటి రక్షణకు ప్రహరీ ఏర్పాటుకు రూ.6.5 కోట్లు అవసరమని వివరించారు.
 
 జిల్లాలో ఏడో విడత భూ పంపిణీకి 332 గ్రామాల్లో 4,731 ఎకరాలు గుర్తించామని, రెండు నెలల్లోగా భూ పంపిణీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 29 జిల్లాస్థాయి అధికారులు, అతిముఖ్యమైన గిరిజన సంక్షేమ ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి, 27 సర్వేయర్, డెప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్లు, వీఆర్వో పోస్టులు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలో పోస్టులు భర్తీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా సంయుక్త కలెక్టర్ సుజాతశర్మ, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ జీవన్, ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్ ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, గజ్జన్న, రామచంద్రయ్య, ఏడీ ల్యాండ్ సర్వే ఇనేష్ పాల్గొన్నారు.
 
 బాధ్యత రెవెన్యూ అధికారులదే..
 ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ అధికారులపై ఉందని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. బుధవారం సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రం సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు కాపాడలేని స్థితిలో ఉన్నందుకు చింతించాల్సిన విషయమని అన్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ సుజాతశర్మ, సబ్‌కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్ జీవన్, ఆర్డీవోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు