మగువలకేదీ భద్రత

26 Sep, 2014 01:10 IST|Sakshi
మగువలకేదీ భద్రత
  • జిల్లాలో మహిళలకు రక్షణ కరువు?
  •  పెరిగిపోతున్న వరకట్న హత్యలు, అత్యాచారాలు, ఈవ్‌టీజింగ్
  •  21.47 లక్షల మహిళా జనాభాకు 210 మంది మహిళా పోలీసులే గతి
  •  మహిళా రిసెప్షనిస్టులు లేక ఫిర్యాదుకు బాధితుల వెనుకడుగు
  •  గత ఏడాది కేసులు.. 451
  • జిల్లాలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఒకపక్క లైంగిక దాడులు, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అయినా వీటిని నియంత్రించే చర్యలు కానరావడం లేదు. 21.47 లక్షల మగువల జనాభా ఉండగా, కేవలం 210 మంది మాత్రమే పనిచే స్తుం డడం విశేషం. జనాభాకు అనుగుణంగా మహిళా పోలీసుల సంఖ్య పెరగడం లేదు. దీంతో మహిళల కష్టాలను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. స్టేషన్‌కు వెళ్లి బాధలు చెప్పుకోవాలన్నా మహిళా సిబ్బందే కరువవుతున్నారు.
     
    సాక్షి,విశాఖపట్నం : జిల్లాలో జనాభా 42.88 లక్షలుకాగా అందులో మహిళల జనాభా 21.47 లక్షలు. వీరి సంఖ్యకు తగ్గట్టుగా మహిళా పోలీసులు లేకపోవడంతో మగువలపై దాడులు పెరిగిపోతున్నాయి. మహిళల జనాభాకు తగ్గట్టుగా కనీసం  550 మందికిపైగా మహిళా పోలీసులు అవసరం.  ప్రసుత్తం 210  మంది మాత్రమే పనిచేస్తుండడం మహిళల భద్రతపై ప్రభుత్వానికికున్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఉన్న సిబ్బందిలో హోంగార్డులు,కానిస్టేబుళ్లు 195వరకు ఉండగా, ఇద్దరు ఎస్‌ఐలు, ముగ్గురు ఏఎస్‌ఐలు మాత్రమే ఉన్నారు.

    దీంతో ఉన్న జనాభాకు వీరే మాత్రం సరిపోని పరిస్థితి. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుత జనాభా, పోలీసుల నిష్పత్తి చూస్తే 10,223 మంది మహిళలకు ఒకే ఒక మహిళా పోలీసు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకంగా పోలీసుస్టేషన్లు ఉండాలనే నిబంధన ఉంది. ప్రస్తుత జనాభాకు తగ్గట్టుగా కనీసం అయిదు స్టేషన్ల వరకు ఉండాలి. కాని అనకాపల్లిలో మాత్రమే ఏకైక మహిళా స్టేషన్ ఉంది. మహిళలు తమ బాధలు చెప్పుకోవాలన్నా ముందుకురాలేని దుస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 43 స్టేషన్లున్నాయి.

    ప్రతిస్టేషన్లో మహిళల ఫిర్యాదులు స్వీకరించడానికి మహిళా రిసెప్షనిస్ట్ ఉండాలి. కాని ఇది పెద్దగా అమల్లో లేదు. దాడులు,నేరాలకు సంబంధించిన దర్యాప్తు గగనమైపోతోంది. ఒకవేళ ముందుకువచ్చి ఫిర్యాదుచేసినా మహిళా సిబ్బంది లేకపోతో మగపోలీసులు ఆకేసులను నీరుగార్చేస్తున్నారు. దీంతో వారికి న్యాయం జరగడం లేదు. ఆందోళనల సమయాల్లో మహిళలను మహిళా పోలీసు సిబ్బంది అదుపుచేయాలి. మగ పోలీసులే ఇవన్నీ చేస్తుండడంతో మహిళలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

    కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం  పనిచేస్తోన్న మగ పోలీసుల్లో 10శాతం కూడా మహిళా పోలీసులు లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.గతేడాది జిల్లాలో వరకట్న హత్యలు 4, వరకట్న చావులు 6,వేధింపులతో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు 13,మహిళల హత్యలు 14, వేధింపుల కేసులు 99,అత్యాచారాలు 9 ఈవిధంగా పలు సెక్షన్ల కింద వివిధ విభాగాల్లో 451 కేసులు నమోదయ్యాయి.
     
     జిల్లాలో మహిళల జనాభా - 21.47
     అవసరమైన మహిళా పోలీసులు- 550
     ప్రస్తుతం ఉన్న వారు- 210
     రిసెప్షన్లు లేని స్టేషన్లు- 43
     అనకాపల్లిలోనే ఒకే ఒక్క స్టేషన్

     

మరిన్ని వార్తలు