సంరక్షణ తక్షణావసరం

4 Oct, 2018 14:38 IST|Sakshi

అంతరించిపోతున్న జంతువులు

పర్యావరణ నాశనమేకారణమంటున్న శాస్త్రవేత్తలు

నేడు ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం

కడప అగ్రికల్చర్‌ : మానవుడు వేగంగా అభివృద్ధి సాధించాలన్న తపనతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు. తనతోపాటు భూమిపై నివసించే ఇతర ప్రాణులకు హాని తలపెడుతున్నాడు. పర్యావరణం దెబ్బతింటుండడంతో చిక్కుల్లో పడుతున్నాడు. తను విలాసవంతంగా జీవించడానికి అడవులను నరికి వేస్తున్నాడు.   దీంతో ఆవాసాలను కోల్పోయి కృ త్రిమ స్థావరాల్లో జీవించలేక వన్యప్రాణులు అంతరించి పోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అరుదుగా ఉండే పక్షుల, జంతువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయని వన్యప్రాణి సంరక్షణ నిపుణులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. జిల్లాలో అంతరించి పోయే జాతులు ఎక్కువగనే ఉన్నాయని చెప్పవచ్చు. వీటి గురించి తెలుసుకోవడానికి,వాటిని కాపాడడానికి ప్రతి ఏటా అక్టోబర్‌ 4వ తేదీన ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ జయకుమార్‌ చెబుతున్నారు.

కృష్ణ జింక...
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందింది. భారత దేశంలో సువిశాల పచ్చిక మైదానాల్లో స్వేచ్ఛగా జీవిస్తుంటాయి. సాధారణంగా ఈ జింకలు 15–20 కలిసి ఒక గుంపులుగా మందగా తిరుగుతుంటాయి. రాను రాను మానవుడు మాంసం కోసం, చర్మం కోసం, సరదా కోసం వేటాడడం వల్ల అంతరించి పోతున్నాయి.

పునుగు పిల్లి...
ఒక రకమైన జంతువు. ఈ పిల్లి గ్రంధుల నుంచి జవాది లేదా పునుగు అనే సుగంధ ద్రవం లభి స్తుంది.  ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కాసింత పునుగు తైలాన్ని విగ్రహానికి పూస్తారు.ఈ పిల్లి కేవలం ఎర్రచందనం, సుగంధం, శ్రీ గంధపు చెట్లకు తన శరీరాన్ని  తాకించి ఒక విధమైన ద్రవాన్ని వదులుతుంది.  ఒకప్పుడు ఈ పిల్లులు వందల సంఖ్యలో కనిపిస్తూ ఉండేవి.  వేటగాళ్లు వీటిని   వలలు వేసి ప్రాణాలతో పట్టుకుని విక్రయిస్తూ వచ్చారు. దీంతో వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.

ఎలుగు బంట్లు..
సాధారణ, పెద్ద అడవుల్లోను నివసించే ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవి, అటవీ సంపదను ఎప్పుడైతే కొల్లగొడుతూ వచ్చారో, అప్పటి నుంచి ఎలుగుబంట్లు ఒక అడవి నుంచి మరో అడవికి పారిపోతువచ్చాయి. మన ప్రాంతాల్లో వీటి మనుగడ లేకుండా పోయింది.

కనిపించని చిరుత పులుల జాడ  
జిల్లాలోని అడవుల్లో అప్పుడప్పుడు కనిపించే చిరుతపులుల జాడ కనిపించకుండా పోయింది. అడవుల్లో ఎప్పుడైతే జన సంచారం పెరిగిందో అప్పటి నుంచి  ఇవి కూడా కనిపించకుండా పోయాయి. వేటగాళ్లు గోర్లు, చర్మాల కోసం వేటాడడం వల్ల వాటి మనుగడకే కష్టంగా మారింది.

కొండముచ్చు కోతులు: గండిలో మాత్రమే కని పించే కొండ ముచ్చు కోతులు  దాదాపుగా కనుమరుగయ్యే స్థితికి వచ్చాయి. కొందరు వీటిని వేటాడి చంపడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని  గండి క్షేత్రంలోని భక్తులు,స్థానికులు చెబుతున్నారు.చిన్న జంతువులైన ఉడతలు, తొండలు, బల్లులు కూడా దాదాపుగా అంతరించి పోయే దశకు చేరుకున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తల సర్వేలో తేలింది.అంతరించి పోతున్న జంతువులను కాపాడుకునేలా ఉద్య మం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వన్యప్రాణులనుకాపాడేందుకు చర్యలు
జిల్లాలోని అటవీ ప్రాంతంలో కొన్ని రకాల జంతువులు అంతరించిపోకుండా చెట్ల పెంపకాన్ని చేపట్టాం. జంతువుల తాగునీటికి, గడ్డికి కొదువలేకుండా కార్యక్రమాలు చేశాం. జనారణ్యంలోకి రాకుండా చర్యలు తీసుకుంటాం.     –శివప్రసాద్,    అటవీ అధికారి, జిల్లా అటవీశాఖ

మరిన్ని వార్తలు