30న కలెక్టరేట్ల ఎదుట ధర్నా

9 Sep, 2015 03:36 IST|Sakshi
30న కలెక్టరేట్ల ఎదుట ధర్నా

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
గాంధీనగర్ :
పాలకులు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలు చేయాలని కోరుతూ ఈనెల 30న అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు మహాసభ పిలుపునిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార్మిక సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్ తెలిపారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  రాష్ట్ర మహాసభల తీర్మానాల వివరాలు వెల్లడించారు. 4నుంచి 6 తేదీల్లో కర్నూలు పట్టణంలో మహాసభలు  నిర్వహించినట్లు చెప్పారు.

భూ బ్యాంకు పేరుతో పేదల ఇళ్ల స్థలాలు, పాఠశాలలు, హాస్పిటళ్లు, కమ్యూనిటీ హాల్స్ లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పేదల ఎసైన్డ్ భూములు, ప్రభుత్వభూములు, రైతులు భూములు లాక్కుని 15 లక్షల ఎకరాలు భూ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నాడని విమర్శించారు. మహాసభల్లో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, ఉపాధి హామీలో 200 పనిదినాలు, రోజు వేతనం రూ. 300 ఇవ్వాలని, సబ్‌ప్లాన్‌నిధులు సక్రమంగా వినియోగించాలని పలు తీర్మానాలు చేసినట్లు చెప్పారు. 30వ తేదీన నిర్వహించే ధర్నాలతో ప్రభుత్వం కళ్లు తెరిపించాలని సూచించారు. మహాసభలలో ఎన్నుకున్న నూతన కమిటీని పరిచయం చేశారు.

>
మరిన్ని వార్తలు