శాంతియుతంగా ఉద్యమించండి

3 Aug, 2013 02:55 IST|Sakshi

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర  ఉద్యమాలను శాంతియుతంగా నిర్వహించాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురామిరెడ్డి పోరాట సంఘాల నాయకులను కోరారు. ఉద్యమంగా సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించవద్దని, విగ్రహాల ధ్వంసం సరికాదని హితవు పలికారు.  
 
 ఈ మేరకు వారు శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేఏసీ నేతలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యార్థి జేఏసీ ప్రతినిధులు, మత పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడకుండా అన్ని సంఘాలు సమన్వయంతో ఉద్యమాన్ని నిర్వహించుకోవాలని సూచించారు.
 
 పవిత్ర రంజాన్ మాసాన్ని నిర్వహించుకుంటున్న ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. జేఏసీ నాయకులు కోరినట్లుగా ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 8వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎస్పీ రఘురామిరెడ్డి ఉద్యమం కారణంగా శాంతిభద్రతల సమస్య తలెత్తరాదన్నారు. జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం మంచిది కాదని తెలిపారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకోకుండా, ఆసుపత్రులు పని చేసేలా సహకరించి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తున్న మనం మన ఆస్తులనే ధ్వంసం చేసుకోవడం సరికాదన్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
 ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. స్వచ్ఛందంగా శాంతియుత రీతిలో ఉద్యమం జరుగుతోందని, అణచివే తకు ప్రయత్నించరాదని కోరారు. అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగానే ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఏజేసీ రామస్వామి, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, పోలీసు అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, జేఏసీ కార్యదర్శి శ్రీరాములు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు