పడకలపై ప్రాణాలు

29 Aug, 2018 13:15 IST|Sakshi
ఆందోళన చేస్తున్న మల్లాది విష్ణు, సీపీఎం నాయకులు

పాత ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో దయనీయ పరిస్థితులు

బెడ్‌లు చాలక గర్భిణులు, బాలింతలు అవస్థలు

ఒకే మంచంపై ముగ్గురిని ఉంచుతున్న వైనం

బెడ్లు పెంపుదలపై నెరవేరని సీఎం చంద్రబాబు హామీ

ఒక బెడ్‌పై ఇద్దరు బాలింతలు ఉండటంతో ఒకరు కింద పడి మృతి

ఘటనపై విచారణకు కలెక్టర్‌  లక్ష్మీకాంతం ఆదేశం

ప్రభుత్వాస్పత్రులపై పాలకులు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిండు ప్రాణాలు బలవుతున్నాయి. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు హామీకే దిక్కులేకుండా పోయింది. ప్రసూతి విభాగంలో బెడ్లు పెంచుతానని చెప్పి నాలుగేళ్లవుతున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో బెడ్లు చాలక ఒకే బెడ్‌పై ఇద్దరు ముగ్గురు గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతున్నారు. ఆపరేషన్లు చేయించుకున్న మహిళల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.  ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రి పడకలపైనే ప్రాణాలు పోయేలా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు) : పోస్టుమార్టం చేసేందుకు ఫోరెన్సిక్‌ వైద్యుడు డబ్బులు డిమాండ్‌ చేసిన ఘటన మరువకముందే విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో బెడ్‌పై నుంచి పడి బాలింత మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.  విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పడకలు పెంచాలని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా పాలకులు పట్టించకోని పాపానికి ఓ బాలింత బలవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. పురిటి నొప్పులు బాధిస్తున్నా పంటి బిగువున భరిస్తూ ఒకే మంచంపై ముగ్గురు నిండు గర్భిణులు సర్ధుకుని కూర్చోవాల్సిందే. బాలింత నొప్పులు.. ఆపరేషన్‌ కుట్లు మానక పోయిన ఒకే మంచంపై ఇద్దరు ఒదిగి ఒకవైపునకు పడుకోవాల్సిందే. ఇదీ విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలోని దయనీయ పరిస్థితి. ఈ విషయాలన్నింటినీ సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం తెలుసు. నాలుగేళ్లలో రెండు సార్లు ఈ విభాగాన్ని పర్చటించి సమస్యలు తెలుసుకున్నారు. కానీ గర్భిణులు, బాలింతలు నరకయాతనకు మాత్రం విముక్తి కలగలేదు. ఆ ఫలితంగా బాలింత మృత్యువాతపడటం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు, సిబ్బందిని సైతం కలిచివేసింది.

పడకలు 240...రోగులు 375....
ప్రసూతి విభాగంలో మంగళవారం అధికారిక లెక్కల ప్రకారం 375 మంది ఇన్‌పేషెంట్స్‌ ఉన్నారు. కానీ అ విభాగంలో అధికారిక, అనధికారిక పడకలు 240 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో 120 పడకలు ప్రసూతి రోగులకు సంబంధించినవి కాగా, మరో 120 స్త్రీల వ్యాదులు, గర్భకోశ వ్యాధులకు సంబంధించి కేటాయించారు.  మంగళవారం ప్రసూతి రోగులు 275 మంది వరకూ ఉన్నారు.  వైద్యులు చేసేదేమి లేక ఉన్న పడకలపైనే సర్దుబాటు చేయడంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరు బాలింతలు. ముగ్గురు గర్భిణులున్నారు.

నాలుగేళ్లుగా పట్టించుకోని వైనం...
ప్రసూతి విభాగానికి వస్తున్న రోగులకు అనుగుణంగా ఆరు యూనిట్లుకు పెంచాలని కోరుతూ 2014 ఆగస్టులో అప్పటి సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని బుట్టదాఖలు చేసిన పాలకులు యూనిట్లు పెంపు విషయాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో అప్పటి నుంచి మంత్రులు ప్రసూతి విబాగాన్ని సందర్శించినప్పుడల్లా అనధికారికంగా పడకలు పెంచుతూ వచ్చారు. అలా అధికారిక పడకలు 90 కాగా, అనధికారికంగా 150 పడకలు ఏర్పాటు చేయడంతో ఆయా వార్డులను పర్యవేక్షించడంతో వైద్యులు, సిబ్బందికి కష్టతరంగా మారుతోంది.

బాలింత మృతిపై మేజిస్టీరియల్‌ విచారణ....
పాత ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి విభాగంలో బాలింత మంచంపై నుంచి కిందపడి మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్‌ మేజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. జేసీ విజయకృష్ణణ్‌ ఆధ్వర్యంలో కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు.

బాలింత మృతి సర్కారీ హత్యే...
ప్రసూతి విభాగంలో ఒకే మంచంపై ఇద్దరు సర్దుకోలేక కిందపడి బాలింత మృతి చెందడమంటే కచ్చితంగా అది సర్కారీ హత్యేనని వైఎస్సార్‌ సీపీ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు అన్నారు. పాత ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఆయన బాధితురాలి బంధువులను పరామర్శించారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రిల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు.

మరిన్ని వార్తలు