చంద్రబాబు కుట్రలపై ఎగసిన నిరసన

26 Jan, 2020 04:13 IST|Sakshi
విశాఖపట్నంలోని తాటిచెట్ల పాలెం జాతీయ రహదారిపైనే వంటావార్పు.. భోజనాలు

వికేంద్రీకరణను అడ్డుకోవద్దంటూ కదం తొక్కిన జనం

రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం, ర్యాలీల హోరు

వర్సిటీల్లోనూ విద్యార్థుల నిరసన ప్రదర్శనలు

అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలన వికేంద్రీకరణ నిర్ణయానికి అడ్డు తగులుతున్న చంద్రబాబు, టీడీపీ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, యువత, మహిళలు ప్రదర్శనలు నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలుచోట్ల రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. విశ్వవిద్యాలయాల్లోనూ నిరసనలు మిన్నంటాయి. 
– సాక్షి నెట్‌వర్క్‌ 
 

స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు తపన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధి కంటే స్వప్రయోజనాలను కాపాడుకునేందుకు తపన పడుతున్నారని విద్యార్థి విభాగం నేతలు విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ నేతల తీరుకు నిరసనగా శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో చంద్రబాబు దిష్టిబొమ్మతో ప్రదర్శన నిర్వహించి, మంగమూరు రోడ్డు కూడలిలో దహనం చేశారు.  

విజయనగరం జిల్లాలో.. 
విజయనగరంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో, కొత్తవలసలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు ఆధ్వర్యంలో, నెల్లిమర్ల, చీపురుపల్లిలోను చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. 

యోగి వేమన యూనివర్సిటీలో.. 
కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో వైఎస్సార్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు సైన్స్‌ బ్లాక్‌ నుంచి ర్యాలీగా ప్రధాన ద్వారం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. రైల్వేకోడూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవ హారంగా ఏర్పడ్డారు. ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ..ప్రజలంతా పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటుంటే చంద్రబాబు తన స్వలాభం అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనంతరం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టారు. 

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో.. 
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులు చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. యాడికి మండలం రాయలచెరువులో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  

గాడిదలకు కట్టి ఊరేగింపు 
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు మాస్క్‌లు ధరించిన వ్యక్తులను గాడిదలకు కట్టి ఊరేగించారు. నందిగాం, కోటబొమ్మాళిలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఎచ్చెర్లలోని బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. పాతపట్నంలో మానహారం నిర్వహించారు. రాజాంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. 

నిరసన గళమెత్తిన ‘తూర్పు’ 
తూర్పుగోదావరి జిల్లా అంతటా శనివారం నిరసనలు మిన్నంటాయి. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విద్యార్థులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి ర్యాలీ నిర్వహించారు. మలికిపురం జంక్షన్‌లో ప్రతిపక్ష దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్దాపురంలో భారీ ర్యాలీ నిర్వహించి చంద్రబాబు, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిష్టిబొమ్మలను తగులబెట్టారు. పి.గన్నవరం, మామిడికుదురు మండలం నగరం, అంబాజీపేట, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం గ్రామాలతోపాటు ధవళేశ్వరంలోని జూనియర్‌ కాలేజీ, కాకినాడ ఎంఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాల వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మలను తగులబెట్టారు. 
చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి 
రాజ్యాంగ స్ఫూర్తిని భ్రష్టుపట్టిస్తూ అభివృద్ధి నిరోధక శక్తిగా మారిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ విద్యార్థిలోకం కదం తొక్కాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో డీఎన్నార్‌ కళాశాల విద్యార్థులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులను అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయాలతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

నాగార్జున వర్సిటీలో.. 
గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ప్రధాన రహదారి వద్ద విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటాన్ని పాదరక్షలతో కొట్టి నిరసన తెలిపారు. అనంతరం జాతీయ రహదారిపైకి ప్రదర్శనగా వెళ్లి ప్రతిపక్ష నేత దిష్టిబొమ్మను తగులబెట్టారు. నల్లపాడు సెంటర్‌లో మహిళలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. గుంటూరు అరండల్‌పేటలో విద్యార్థులు చంద్రబాబు శవయాత్ర చేపట్టారు. అనంతరం ఆయన చిత్రపటాన్ని పాదరక్షలతో కొట్టి ధ్వంసం చేశారు. 

ఎస్వీయూలో.. 
తిరుపతిలో విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.కలకడలో చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఏర్పేడు మండలం మర్రిమందలో చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. పుంగనూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. 

విశాఖలో నిరసనల వెల్లువ 
చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ తీరుపై విశాఖ జిల్లాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. చంద్రబాబు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దిష్టిబొమ్మలను దహనం చేశారు. మద్దిలపాలెంలో 8 కిలోమీటర్ల మేర భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పర్యాటశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నా«థ్, తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని తాటిచెట్లపాలెం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై వంటా వార్పు చేశారు. చోడవరం, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో నిరసనలు కొనసాగాయి. 

మరిన్ని వార్తలు