మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి

28 Jan, 2020 05:08 IST|Sakshi
విజయవాడలో..

పాలనా వికేంద్రీకరణపై టీడీపీ వైఖరికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు

చంద్రబాబు, టీడీపీ నేతల దిష్టిబొమ్మల దహనాలు

టీడీపీ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు, సత్యాగ్రహ దీక్షలు, రాస్తారోకోలు

సాక్షి, నెట్‌వర్క్‌: మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న టీడీపీ, ఆ పార్టీ నేతల తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. టీడీపీ నేతలు రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీడీపీ నేతల తీరును గర్హిస్తూ సత్యాగ్రహ దీక్షలు, నిరసనలు, బైక్‌ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. 

ఉత్తరాంధ్రలో చంద్రబాబుపై ఆగ్రహ జ్వాలలు
రాజధాని వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని, దీన్ని అడ్డుకుంటున్న ద్రోహులు.. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడు ఖబడ్దార్‌ అంటూ శ్రీకాకుళం జిల్లా అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో తరలివచ్చాయి. ర్యాలీ అనంతరం భారీ మానవహారం ఏర్పాటు చేసి చంద్రబాబు, అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు.
హిందూపురంలో.. 

అలాగే ఎచ్చెర్ల, ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాల్లోనూ బైక్‌ ర్యాలీలు నిర్వహించి దిష్టిబొమ్మలను తగులబెట్టారు. విజయనగరం జిల్లాలోనూ భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ నేతలు మోకాలడ్డటం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. విశాఖ నగరంలో ఆందోళనలు ఉవ్వెత్తున సాగాయి. ఉత్తరాంధ్రకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. విశాఖ జిల్లావ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు, నిరసనలు, రాస్తారోకోలు జరిగాయి.

ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో బైక్‌ ర్యాలీలు
వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను అప్రజాస్వామికంగా మండలిలో చంద్రబాబు అడ్డుకున్నందుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం నిరసన ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు ఈ ర్యాలీలు చేపట్టాయి. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీ మార్గాని భరత్‌తోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా ర్యాలీలు నిర్వహించారు.

వైఎస్సార్‌ విగ్రహాలకు నివాళులర్పించి చంద్రబాబుతోపాటు టీడీపీ నేతల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉండి, పాలకొల్లు, ఆచంట, భీమవరం, నిడదవోలు తదితర నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు బైక్‌ ర్యాలీలు నిర్వహించి చంద్రబాబు తీరును ఎండగట్టారు. టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విజయవాడలో వైఎస్సార్‌సీపీ నగర యువజన విభాగం అధ్యక్షుడు అశోక్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా పాల్గొన్నారు.  

రాయలసీమ జిల్లాల్లో భారీ ఎత్తున నిరసనలు
ప్రజాస్వామ్య విలువలను హరిస్తూ టీడీపీ వికేంద్రీకరణ బిల్లుకు అడ్డుపడడాన్ని నిరసిస్తూ తిరుపతి నగరంలో, ఎస్వీ యూనివర్సిటీ, గుడిపాలలో బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేతలు ఇమామ్, మధుసూదన్‌ రాయల్‌ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ వైఖరికి నిరసనగా పలు కార్యక్రమాలు చేపట్టారు. పాలనా వికేంద్రీకరణ బిల్లును మండలిలో టీడీపీ అడ్డుకున్నందుకు నిరసనగా జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు కర్నూలులోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అలాగే కర్నూలు నగరంలో, నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ నేతలు బైక్‌ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ జిల్లా ఎన్‌జీవో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. నంద్యాల, ఎమ్మిగనూరు, పత్తికొండ, బనగానపల్లె పట్టణాల్లోనూ ధర్నాలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో టీడీపీ తీరుకు నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. హిందూపురంలో భారీ ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మకు ఉరేసి నిరసన వ్యక్తం చేశారు. 

మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి
పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు
మూడు రాజధానులు ముద్దు అంటూ ప్రజల నినాదాలు

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు, యువజన, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. భారీగా మానవహారాలుగా ఏర్పడి ‘మూడు రాజధానులు ముద్దు.. అమరావతి ఒక్కటే వద్దు’ అంటూ నినదించారు. మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 

ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో..
పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నం ఏయూలో ఉద్యోగులందరూ విశాఖ రాజధాని కావాలని ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు ఎదుట మూడు రాజధానులకు మద్దతుగా న్యాయవాదులు నినాదాలు చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, యువజన, విద్యార్థి, ప్రజా సంఘాలు బైక్‌ ర్యాలీలను చేపట్టాయి. పెద్ద ఎత్తున మానవహారాలను ఏర్పాటు చేసి మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లాలోని ఆధ్మాత్మిక క్షేత్రం ద్రాక్షారామం దద్దరిల్లింది. యువత, పలు సంఘాల నాయకులు, కుల సంఘాల నేతలు, వ్యాపార వర్గాలు బైకు ర్యాలీ నిర్వహించాయి. 

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో..
పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టాయి. 3 రాజధానులు ముద్దు.. అమరావతి  ఒక్కటే వద్దు అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా ప్రకాశం జిల్లాలో పలుచోట్ల బైక్‌ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఒంగోలులో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు నాయకత్వంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. మార్కాపురంలో ర్యాలీ నిర్వహించి మూడు రాజధానులకు మద్దతుగా తహసీల్దార్‌ సుజాతకు అర్జీ అందించారు. పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు, గూడూరు పట్టణాల్లో ర్యాలీలు జరిగాయి. నెల్లూరులో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పిలుపు మేరకు భారీ ఎత్తున స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. గూడూరులో విద్యార్థులు, కోవూరులో ప్రజలు ర్యాలీలు చేపట్టారు. 

రాయలసీమ జిల్లాల్లో భారీ ర్యాలీలు
వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కడపలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మూడు రాజధానులకు మద్దతుగా అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు ర్యాలీలు చేపట్టారు. అనంతపురం జిల్లా రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ కళాశాలలో 3 రాజధానుల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు సదస్సు జరిగింది.

మరిన్ని వార్తలు