రెండో రోజూ నిరసనల హోరు

4 Jan, 2019 11:48 IST|Sakshi
కొనకనమిట్ల మండలం నాగంపల్లిలో గ్రామంలోని సమస్యలపై అధికారులను నిలదీస్తున్న స్థానికుడు

జన్మభూమి సభల్లో పెల్లుబుకుతున్న జనాగ్రహం

చవటపాలెంలో సభను అడ్డుకున్న గ్రామస్థులు

కనపర్తి ఎత్తిపోతల పథకానికి                నీరివ్వాలని డిమాండ్‌

మధ్యాహ్నం వరకు నిలిచిపోయిన జన్మభూమి

నాగులుప్పలపాడులోనూ సభకు అడ్డంకులు

సమస్యలు పరిష్కరించలేదంటూ ఆందోళన

చీరాలలో ఇంటి స్థలాలు, రేషన్‌కార్డుల ఇవ్వలేదని నిలదీత

విఠలాపురంలో మరుగుదొడ్ల బిల్లుల కోసం స్థానికుల ఆందోళన

వల్లూరు బడిలో మధ్యాహ్నం భోజనం   బాగాలేదని మంత్రికి విద్యార్థినుల వినతి

జిల్లాలో ఆరో విడత జన్మభూమి సభలు నిరసనలు,నిలదీతల మధ్య సాగుతున్నాయి. తొలిరోజే ప్రతికూల పరిస్థితుల్లో సాగగా రెండో రోజు గురువారం కూడా అధికారులు, ప్రజాప్రతినిధులకు జనాగ్రహమే
ఎదురైంది. ఎక్కడికక్కడ నిలదీతలు, అడ్డగింతలు,  సభల బహిష్కరణలతో రచ్చరచ్చగా మారాయి. దాదాపు ప్రతి చోటా ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని      జన్మభూమి గ్రామ సభలను ప్రజలు అడ్డుకున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు :  జన్మభూమి–మా ఊరు కార్యక్రమం రెండో రోజు గురువారం కూడా నిరసనల మధ్య సాగింది. సమస్యలు పరిష్కరించని జన్మభూమి ఎందుకంటూ ప్రజలు నిలదీస్తున్నారు.  సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే సభలు జరగనిస్తున్నారు. తాగు, సాగునీటితోపాటు పెన్షన్లు, రేషన్‌ కార్డులు లాంటి సమస్యలు పరిష్కరించాలంటూ  సభల్లో అధికారులను నిలదీస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం చవటపాలెంలో కనపర్తి ఎత్తిపోతల పథకానికి రెండేళ్లుగా నీరివ్వడం లేదని అధికారులను పలుమార్లు అడిగినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు అధికారులను నిలదీసి గ్రామ సభను అడ్డుకున్నారు. నీరిస్తామంటేనే సభ జరగనిస్తామంటూ డిమాండ్‌ చేశారు. దీంతో మధ్యాహ్నం వరకు జన్మభూమి ఆగిపోయింది. అధికారులు జాయింట్‌ కలెక్టర్, ఆర్‌డీఓతో మాట్లాడి ఈ సీజన్‌లో ఆరుతడి పంటలకు నీటిని ఇస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం తర్వాత జన్మభూమిని నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోనూ జన్మభూమి సభను గ్రామస్థులు అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన వినతులను పరిష్కరించకుండా ఇప్పుడు జన్మభూమిని నిర్వహించడమెందుకంటూ స్థానిక ప్రజలు అధికారులను నిలదీశారు. దీంతో రెండుగంటల పాటు సభ నిలిచి పోయింది.

మద్దిపాడు మండలం గడియపూడిలో జనం రాక జన్మభూమి సభ నిలిచి పోయింది. అధికారులు స్కూలు పిల్లలను కూర్చోపెట్టి మొక్కుబడిగా సభ జరిపించుకున్నారు.
టంగుటూరు మండలం వల్లూరులో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు మిడ్‌ డే మీల్స్‌ బాగోలేదని మంత్రి శిద్దా రాఘవరావుకి వినతిపత్రం అందించారు. ఇంటి నుంచి లంచ్‌ బాక్సులు తెచ్చుకుని తింటున్నామని, మంచినీరు కూడా లేదని మంత్రి దృష్టికి తెచ్చారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
తాళ్లూరు మండలం విఠలాపురంలో జరిగిన సభలో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులను ప్రభుత్వం ఇంత వరకు చెల్లించలేదని తక్షణం బిల్లులు ఇవ్వాలని  ఎంపీపీ మోషే అధికారులను నిలదీశారు. దీనిని టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు.
చీరాల మున్సిపాలిటి 8వ వార్డులో ఇంటి స్థలాలు, రేషన్‌కార్డులు మంజూరు చేయలేదంటూ స్థానికులు అధికారులను నిలదీశారు. రూరల్‌ పరిధిలోని విజయనగర వాసులు జన్మభూమిలో సమస్యలపై అధికారులను నిలదీశారు.
కొనకనమిట్ల మండలంలోని నాగంపల్లి జన్మభూమి సభలో గ్రామస్థులు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామంటూ అధికారులను నిలదీశారు.
హెచ్‌ఎంపాడు మండలం దాసరిపల్లి జన్మభూమి సభలో అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెన్షన్లు మంజూరు చేయలేదంటూ ప్రజలు అధికారులను నిలదీశారు.  – వెలిగండ్ల మండలం తందువ గ్రామంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, తక్షణం నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి సమస్యతో అల్లాడి పోతున్నామని, గతంలో నీటిని సరఫరా చేసిన ప్రభుత్వం ఇప్పుడు అది కూడా మానుకుందని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఉపాధి పనులు పూర్తిస్థాయిలో కల్పించడం లేదని, కూలి తక్కువ పడుతుందని గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
కందుకూరు మండలం జి.మేకపాడులో గ్రామంలో పింఛన్లు, రేషన్‌కార్డులు, మంచినీటి సరఫరా వంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు రెండు గంటలపాటు జన్మభూమి సభను అడ్డుకున్నారు.

మరిన్ని వార్తలు