ఆ మృగాళ్లను ఉరి తీయండి 

1 Dec, 2019 03:54 IST|Sakshi
ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న మహిళలు, విద్యార్థినులు

ప్రియాంకరెడ్డి హత్యపై ఏపీలో వెల్లువెత్తిన నిరసనలు 

సాక్షి నెట్‌వర్క్‌: హైదరాబాద్‌ శివార్లలో పశు వైద్యురాలు ప్రియాంకరెడ్డిపై దారుణ మారణకాండను నిరసిస్తూ శనివారం రాష్ట్రంలోని విద్యార్థులు, మహిళలతో పాటు ఉద్యోగ, ప్రజా సంఘాలు గళమెత్తాయి. అత్యంత పాశవికంగా ప్రవర్తించిన ఆ నలుగురు మృగాళ్లను ఉరితీయాలంటూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కామాంధుల నుంచి మహిళలకు రక్షణ కల్పించేలా కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల ప్రియాంకరెడ్డికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. అమలాపురం, ముమ్మిడివరం, రాజమహేంద్రవరం, రంపచోడవరం, చింతూరు, ఏలేశ్వరం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఆందోళనల్లో విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గుంటూరు జీజీహెచ్‌లో విద్యార్థులు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్, రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ తదితరులు పాల్గొని ప్రియాంకరెడ్డికి నివాళులర్పించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టారు. హిందూపురంలో కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్కేయూ విద్యార్థి లోకం ప్రియాంకరెడ్డికి అశ్రునివాళి అర్పించింది.

ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ శ్రీపద్మావతి మహిళా జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు నినాదాలు చేశారు. విశాఖ జిల్లా పాడేరులో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు, రంపచోడవరం ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, ధనలక్ష్మీలు ర్యాలీలో పాల్గొని ప్రియాంకరెడ్డి హత్య ఘటనను ఖండిస్తూ నినాదాలు చేశారు.  

మరిన్ని వార్తలు