నిరసనలకు శ్రీకారం

2 Nov, 2014 01:33 IST|Sakshi
నిరసనలకు శ్రీకారం
  •  పింఛన్లు..పరిహారం కోసం ఆగ్రహం
  •  ఎంపీ, ఎమ్మెల్యేలకు తప్పని నిరసన
  •  ప్రోటోకాల్ ఉల్లంఘించిన అరకు ఎంపీ    
  •  జన్మభూమిలో గళమెత్తిన ప్రజలు
  • సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి-మావూరు పునఃప్రారంభించిన తొలిరోజే జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు సొం తనియోజకవర్గంలోనే చుక్కెదురైంది. 1వ వార్డు ఆరిలోవ ప్రాంతంలో జరిగిన గ్రామసభలో తుఫాన్ బాధితులు ఎమ్మెల్యేను నిలదీశారు. తుఫాన్ తర్వాత మీరు కానీ..మీ అధికారులు కానీ మావైపు కన్నెత్తయినా చూడలేదు. సాయం పంపిణీలో వివక్ష చూపారు.

    2వ వార్డులో పంపిణిచేసేరే తప్ప ఆరిలోవలో ఒక్క కిలో బియ్యం ఇవ్వలేదంటూ మండిపడ్డారు. దీనిపై సమాధానం చెప్పలేక ఇబ్బందిపడిన ఎమ్మెల్యే మీరు చెప్పింది నిజమే..సాయం పంపిణీసరిగా జరగలేదు.. మీకు పరిహారం విషయంలో న్యాయంచేస్తానని హామీ ఇచ్చారు. నక్కపల్లిలో మంత్రి గంటా శ్రీనివాస రావు కాన్వాయ్‌ను గత 45 రోజులుగా ఆందోళన చేస్తున్న యానిమేటర్లు అడ్డుకుని బైటాయించారు.

    తమతో ప్రభుత్వం కనీసం చర్చలు కూడాజరపలేదని..ఆకలితో అలమటిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేయగా ప్రభుత్వం దృష్టికితీసుకెళ్తాననంటూ వారికి సర్దిచెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మంత్రి గంటా పాయక రావుపేటలో పింఛన్‌దారుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొక తప్పలేదు. పింఛన్లలో కోత పెట్టారని.. తాము ఏ విధంగా అనర్హులమో చెప్పాలని మంత్రిని నిలదీయగా,న్యాయంచేస్తామని హామీ ఇచ్చారు.

    భీమిలి మండలం మాలకుద్దులో పింఛన్ల కోతపై బాధితులు ఎంపీపీ, జెడ్పీటీసీలను నిలదీశారు. తమకు వెంటనే పింఛన్లు పునరుద్దరించాలని వారిని చుట్టుముట్టి నినాదాలు చేసారు. ఇదే మండలంలోని తాటితూరులో తుపాన్ బాధితులు అధికారులపై విరుచుకుపడ్డారు.  వీరికి మద్దతుగా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ దుంపల నాగమణి, పార్టీ నాయకులు ఎస్‌వి రమణారెడ్డి, ఈశ్వరరావులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు.

    ఈ దశలో టీడీపీ నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు సర్వేలో తప్పులు చేసారని చక్కదిద్దుతామని టీడీపీ నాయకులు ప్రజలకు సర్దిచెప్పి అక్కడ నుంచి వెళ్లాల్సి వచ్చింది. చోడవరం మండలం గోవాడ సభలో స్థానికులు గత జన్మభూమిలో ఇచ్చిన హామీలే అమలు చేయలేదు..మళ్లీ ఎందుకొచ్చారంటూ అధికారులపై మండిపడ్డారు. పారిశుద్ద్యంపై ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో చక్కదిద్దుతామనిచెప్పి నెలరోజులు గడుస్తున్నా పట్టించుకోలేదంటూ ఆరోపించారు. ఇదే మండలం నర్సాపురంలో పాస్‌పుస్తకాలజారీలో జరుగుతున్న జాప్యంపైరైతులు నిలదీయగా, జొన్నవరంలో పింఛన్ల కోతపై బాధితులు మండిపడ్డారు.
     
    పాడేరు మండలం పలుగు గ్రామసభలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. పింఛన్లను పంపిణీకి స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సిద్దపడగా గీత అడ్డుకుని ఇది మా ప్రభుత్వం మీరెవరూ పంపిణీ చేయడానికని ప్రశ్నించడంతో ఏ పార్టీలో ఉన్నావో తెలుసా అంటూ ఎమ్మెల్యే వర్గీయులు నిలదీశారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో గందరగోళ పరిస్థితులు ఏర్పడి ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొనడంతో పోలీసులుజోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

    ఇదే మండలం మొదపల్లి పంచాయితీలో జరిగిన సభకు హాజరైన ఎంపీ కొత్తపల్లి గీతను స్థానిక వైఎస్సార్‌సీపీ ఎంపీపీ ముత్యాలమ్మ నిలదీశారు. ఏపార్టీ తరపున ఇక్కడ పాల్గొంటున్నావో..ఏ విధంగా హామీలు అమలు చేస్తావో చెప్పాలని డిమాండ్ చేయడంతో ఎంపీ వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇక్కడ కూడా పోలీసులు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నక్కపల్లిమండలం రమణయ్య పేట, చినదొడ్డుగల్లు, సీహెచ్‌వి అగ్రహరంల్లో కూడా పింఛన్‌దారులు అధికారులకు ముచ్చెమటలు పోయించారు.
     
    ‘పచ్చ’పాతమే..
     జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకుల పెత్తనం ఎక్కువైపోతోందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులను కాదని టీడీపీ నాయకుల చేత కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్నారు. చూస్తుంటే ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేదా ‘పచ్చ’పార్టీ కార్యక్రమమా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. పాడేరు మండలం సలుగు, మోదాపల్లి గ్రామాల్లో శనివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత, టీడీపీ నాయకుల వ్యవహార శైలి సక్రమంగా లేదన్నారు. తుఫాన్ సహాయక చర్యల్లోనూ తెలుగు తమ్ముళ్లదే హవా కనిపిస్తోందన్నారు. నిజమైన బాధితులకు పరిహారం దక్కడం లేదన్నారు. టీడీపీ అనుచరులకే సాయం అందుతోందన్నారు. మారుమూల గిరిజనులు ఇప్పటికీ నిత్యావసరాలకు నోచుకోలేదన్నారు. బాధితులకు పూర్తి సాయం కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం సాగిస్తుందన్నారు.
     -గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు
     

మరిన్ని వార్తలు