నిరసనలు.. నిలదీతలు

14 Nov, 2013 04:07 IST|Sakshi

కుంటాల/భైంసారూరల్, న్యూస్‌లైన్ :  భైంసా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన భైంసా మండలం రచ్చబండ మూడో విడత కార్యక్రమం నిరసనలు, నిలదీతల మధ్య ముగిసింది. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ప్రారంభంకాగానే కోతల్‌గాం గ్రామానికి చెందిన లక్ష్మి, హజ్గుల్ గ్రామానికి చెందిన అనురాధ పింఛన్లు ఎందుకు మంజూరు చేయడంలేదని అధికారులను నిలదీశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా స్పందించడంలేదని మండిపడ్డారు. స్పందించిన అధికారులు అర్హులందరికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

పింఛన్‌కు తాను అన్నివిధాలా అర్హుడినైనా మంజూరు చేయకపోవడంపై పేండ్‌పెల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు సురేశ్ నిరసన వ్యక్తం చేశాడు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం లేదని పలువురు ప్రశ్నించారు. ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంతో ప్రజలకు ఒనగూరేదేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 గంట ఆలస్యంగా ప్రారంభం...
 రచ్చబండ కార్యక్రమం ముందుగా ప్రకటించినదానికంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు బదులు మూడింటికి సభ మొదలైంది. దీంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అధికారుల కోసం ఎండలో నిరీక్షించారు. బంగారుతల్లి పథకం బాండ్‌ల కోసం వచ్చిన బాలింతలూ అవస్థలు పడ్డారు.
 తెలంగాణ నినాదాలు...
 రచ్చబండ సభలో తెలంగాణ నినాదాలు హోరెత్తాయి. పలువురు జెతైలంగాణ అంటూ నినదించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టాలని కోరారు.  
 అర్హులందరికీ సంక్షేమ ఫలాలు..
 రచ్చబండ ద్వారా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి పేర్కొన్నారు. దశలవారీగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రచ్చబండలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కారానికి చొరవ చూపుతానని చెప్పారు. ప్రత్యేక అధికారి పెర్క యాదయ్య మాట్లాడుతూ ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని, ప్రభుత్వ సాయంతో నిర్మించుకోవాలని కోరారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాల మంజూరు పత్రాలు, బంగారుతల్లి బాండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో జియూవోద్దీన్, ఎంఈవో దయానంద్, పీఆర్ డిప్యూటీ ఈఈ రామకృష్ణారెడ్డి, హౌసింగ్ డీఈ శ్రీనివాస్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు సోలంకి భీంరావు, మాజీ ఎంపీపీ రాంచంద్రారెడ్డి, ఐకేపీ ఏపీఎం వాణిశ్రీ, ఈజీఎస్ ఏపీవో నవీన్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు