సమ్మెలోని ఉద్యోగులకు వేతనంపై రుణం మంజూరుకు ఆంధ్రాబ్యాంక్ నిర్ణయం

28 Sep, 2013 01:33 IST|Sakshi
చిలకలూరిపేటరూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణకు కంకణబద్ధులై పోరు బాట వీడని ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఇప్పటికే గత నెల జీతం అందక కుటుంబ పోషణ భారమైన పరిస్థితుల్లో ఆంధ్రా బ్యాంకు తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు ఊరట నివ్వబోతోంది. ఉద్యోగి జీవితం ప్రతినెలా ఒకటో తేదీన అందే జీతంపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఒక నెల జీతం రాకపోయినా వారి బడ్జెట్ తలకిందలవుతుంది. ముఖ్యంగా పిల్లల స్కూల్ ఫీజులు, విద్యుత్ బిల్లులు, పాలు, నిత్యావసర వస్తువులు, ఇంటి అద్దె తదితర చెల్లింపులు నిలిచిపోతాయి. సమ్మెతో ఇప్పటికే ఉద్యోగులకు ఒక నెల జీతం రాలేదు. వచ్చే నెల జీతం కూడా అందే పరిస్థితి లేదు. 
 
కొందరు ఉద్యోగులు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకు వస్తున్నారు. ఈ పరిస్థితిలో ఉద్యోగులను ఆదుకోవాలని ఆంధ్రాబ్యాంక్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆ బ్యాంక్ డీజీఎం విఎం పార్థసారధి శుక్రవారం ఫోన్‌లో ‘న్యూస్‌లైన్’తో  మాట్లాడారు. మూడు విధానాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంపై రుణం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని బ్యాంక్ శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
 
ఆంధ్రా బ్యాంక్‌లో గతంలో రుణాలు తీసుకున్న ఉద్యోగులకు ఆ రుణాన్ని పెంచి సర్దుబాటు పద్దు కింద మరి కొంత మొత్తాన్ని అందిస్తామన్నారు. బ్యాంక్ ద్వారా ప్రతినెలా జీతాన్ని పొందుతూ రుణాలు తీసుకోని వారికి ప్రత్యేక రుణం మంజూరు చేస్తారు. సూపర్ శాలరీ సేవింగ్ స్కీం కింద ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఒక నెల జీతాన్ని అందిస్తారు. ఫించన్ ఎకౌంట్ ఉన్న పదవీ విరమణ ఉద్యోగులకు సైతం ఇది వర్తిస్తుందన్నారు. సమ్మె పూర్తయిన అనంతరం రుణ  రికవరీ వుంటుందన్నారు.
 
మరిన్ని వార్తలు