ఆ సమయంలో చాలెంజింగ్‌గా పనిచేశాం..

24 Jun, 2020 11:04 IST|Sakshi

కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం 

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేశాం 

స్వచ్ఛతకు పెద్దపీట వేశాం 

23వేల మందికి ఇంటి పట్టాలు అందిస్తాం 

ఏడాది పాలన సంతృప్తికరం 

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ గిరీషా అంతరంగం

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా పీఎస్‌ గిరీషా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు విశేషంగా కృషి చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో కరోనా కట్టడికి ఆదర్శవంతంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో సఫలీకృతులయ్యారు. బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. – తిరుపతి తుడా 

కోవిడ్‌ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కొన్నారు..? 
సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి ఆ దిశగా పరుగులు పెట్టే సమయంలో కరోనా ఉపద్రవంగా వచ్చిపడింది. సుమారు 3నెలల పాటు మరో పనిలేకుండా చేసింది. కరోనా కట్టడిలో తిరుపతి కార్పొరేషన్‌ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. స్వచ్ఛ సర్వేలోనూ నగరం అగ్రస్థానంలో నిలవడం గర్వకారణం. విదేశాల నుంచి వచ్చిన వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాం. వారి ఇళ్లకు రెడ్‌ నోటీసులు, చేతికి స్టాంప్‌ వేయడం వంటివి సత్ఫలితాలు ఇచ్చాయి. కూరగాయల మార్కెట్‌ను వికేంద్రీకరించి, తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. స్పెషల్‌ రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ల ద్వారా ప్రత్యేకంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాం. హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయడం, రెడ్‌ జోన్‌ల అమలు వంటి కీలక నిర్ణయాలు కరోనా కట్టిడికి దోహదపడ్డాయి. తిరుపతిలో నాలుగు లక్షలకుపైగా జనాభా ఉండగా లాక్‌ డౌన్‌ సమయంలో కేవలం తొమ్మిది పాజిటివ్‌ కేసులకే  కట్టడి చేశామంటే సమష్టి కృషితోనే సాధ్యమైంది. 
 
అభివృద్ధిలో మీ మార్క్‌..? 
కరోనా కట్టిడికి 3 నెలలు, వార్డు సచివాలయాల ఏర్పాటుకు మరో మూడు నెలలు సమయం గడిచిపోయింది. మిగిలిన ఆరు నెలల్లో అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకుని వాటిని పరుగులు పెట్టించాం. పద్మావతి, ప్రకాశం పార్కులను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం. గరుడ వారధికి నిధులు సమకూర్చి పనులకు ఆటంకం లేకుండా చేశాం. అమృత్‌ స్కీమ్‌ ద్వారా 90 శాతం పనులు పూర్తి చేశాం. 15 ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేశాం. సుమారు రూ.21 కోట్లతో వినాయక సాగర్‌కు అనుమతులు తీసుకుని పనులను ప్రారంభించాం. విలీన పంచాయతీల్లో రూ.16 కోట్లతో తాగునీటి సౌకర్యం, రోడ్లు, కాలువలు, యూడీఎస్‌ అందించేలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నాం. డీబీఆర్, కరకంబాడి–రేణిగుంట రోడ్లను కలిపే చెన్నగుంట లింక్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేయడంతో కమిషనర్‌గా నా మార్కు కనిపించడం ఆనందంగా ఉంది. చదవండి: పలమనేరులో నువ్వా- నేనా..?

ఇళ్ల పట్టాల పంపిణీపై..? 
పట్టణాల్లో ఇళ్లు లేని ప్రజలకు బహుళ అంతస్తులు నిర్మించి ఇవ్వడం ఇప్పటి వరకు చూశాం. దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడం నిజంగా చారిత్రాత్మక నిర్ణయం. ఈ అపురూప ఘట్టం నా చేతుల మీదుగా జరుగుతుండడం జీవితంలో మరచిపోలేను. నగరంలో 23 వేల మంది అర్హులకు జూలై 8న ఇంటి పట్టాలు పంపిణీ చేస్తాం. 

ఏడాది పాలన ఎలాఉంది...? 
తిరుపతిలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదివరకు జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసినా ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించడం ప్రత్యేకమనే చెప్పాలి. బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాలను సకాలంలో అధిగమించాం. పథకాల అమలులో రాష్ట్రంలోనే తిరుపతి ముందుంది. ఏడాది పాలన విజయవంతంగా పూర్తిచేసుకోవడం సంతోషంగా ఉంది. 

స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2021 మొదలైందా..? 
స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020ను విజయవంతంగా పూర్తిచేశాం. కరోనా కారణంగా ర్యాంకులను ఇప్పటి వరకు ప్రకటించకపోయినా గతంలో కంటే మెరుగైన స్థానంలో ఉంటామని ఆశిస్తున్నాం. సాలిడ్‌ వేస్టు మేనేజ్‌మెంట్‌లో దేశవ్యాప్తంగా ఏ నగరం కూడా మనకు సాటి రాదు.  సుమారు రూ. 40 కోట్లతో బయోమైనింగ్, తడి చెత్త ద్వారా దేశంలోనే అతిపెద్ద బయో గ్యాస్‌ ప్లాంట్, భవన వ్యర్థాల ద్వారా ఉత్పత్తులు, ఇలా చెత్త నిర్వహణ చేపట్టాం. ఇదే స్ఫూర్తితో 2021 పోటీలకు సన్నద్ధమయ్యాం. 

మీకు చాలెంజింగ్‌గా అనిపించినవి ..? 
ప్రజలకు సులభంగా.. తొందరగా.. అవినీతిరహితంగా సేవంలదించాలనే సంకల్పంతో వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే మాకు ఇదో పెద్ద టాస్క్‌. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు గత ఏడాది జూలై లోపు నగరంలో 102 సచివాలయాలను ఏర్పాటు చేశాం. భవనాల ఎంపిక, మౌలిక వసతుల కల్పన సమస్యలను అధిగమించాం. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన సచివాలయాలను నగరంలో ఏర్పాటు చేయడం, ప్రజల ఇంటికే సంక్షేమ పథకాలను అందించడం,  సుమారు 3 వేల మంది వార్డు వలంటీర్లను ఎంపిక చేయడం, కరోనా కట్టడి వంటివి చాలెంజింగ్‌గా తీసుకుని పనిచేశాం.


అర్జీలను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు (ఫైల్‌) 

సేవలో విలక్షణ శైలి
అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్‌ అధికారి స్థాయికి చేరుకున్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా రెవెన్యూ పాలనలో తన మార్క్‌ వేస్తున్నారు. భూ బకాసురులపై కొరడా ఝళిపిస్తున్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల స్వా«దీనానికి చర్యలు చేపట్టారు.  పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజల ప్రశంసలు అందుకున్నారు. బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తి చేసుకుంటున్న జేసీ (రెవెన్యూ) డి.మార్కండేయులుపై ప్రత్యేక కథనం. 
– చిత్తూరు కలెక్టరేట్‌ 

జిల్లా పాలనలో తనదైన మార్క్‌ వేసుకున్నారు జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) డి.మార్కండేయులు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సమర్థవంతగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీకి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించేందుకు కిందిస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కింది స్థాయి నుంచి ఐఏఎస్‌గా ఎదిగిన ఆయన గతంలో డీఆర్‌ఓగా, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికలసంఘం జాయింట్‌ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు.  2019 జూన్‌ 24 న జాయింట్‌ కలెక్టర్‌గా జిల్లాకు వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తవుతోంది. 

భూఆక్రమణలపై ప్రత్యేక దృష్టి 
జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలోని పలు ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ముందుగా వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఏడాదిలో సుమారు 225.12 ఎకరాల భూమిని ప్రభుత్వ పరం చేశారు.  వెదురుకుప్పం మండలం అల్లమడుగు గ్రామంలో 86.38 ఎకరాలు,  ఎస్‌ఆర్‌పురం మండలంలోని జీఎంఆర్‌ పురంలో 9.00 ఎకరాలు,  పెనుమూరు మండలం గుంటిపల్లిలో 35 ఎకరాలు, నారాయణమండలం బొప్పరాజుపాళ్యంలో 36.97 ఎకరాలు, వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరులో 10.29 ఎకరాలను ప్రభుత్వానికి స్వా«దీనం చేశారు.

అలాగే శ్రీకాళహస్తి మండలంలోని రామానుజపల్లిలో సర్వే నంబర్‌ 1లో 903.63 ఎకరాలు, సోమల మండలంలోని పెద్దఉప్పరపల్లిలో 269/7 సర్వే నంబర్‌లో 1.58 ఎకరాల గుట్టపోరంబోకును సర్కార్‌ ఆధీనంలోకి తీసుకువచ్చారు. ఎస్టేట్‌ అబాలి‹Ùమెంట్‌ యాక్ట్‌ 1948 ప్రకారం 11 కేసులకు గాను 92.10 ఎకరాల భూ సమస్యలను పరిష్కారించారు. 22ఏ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ 1908 ప్రకారం 166 కేసులకు గాను 314.70 ఎకరాల భూ సమస్యలకు తెరదించారు. 32 చుక్కల భూముల కేసులకు గాను 28.41 భూ సమస్యలకు పరిష్కారం చూపించారు.  చదవండి: మాతృదేవతా మన్నించు

స్పందన సమస్యల పరిష్కారం 
స్పందన కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి వహించారు. ఏడాది కాలంలో భూ సమస్యలపై ప్రజలిచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల ద్వారా పరిష్కారం చేయించారు. 

హైవే విస్తరణ సమస్యలకు చెక్‌
జిల్లాలో జరుగుతున్న ఎన్‌హెచ్‌–140 హైవే పనుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. భూ విరాళదాతలకు వెంటనే పరిహారం అందించేందుకు కృషి చేశారు. ముఖ్యంగా కుక్కలపల్లి, కాణిపాకం, పూతలపట్టు, పి.అగ్రహారం, కొత్తకోట, పాకాల, గాదంకి, చంద్రగిరి ప్రాంతాల్లో భూ సమస్యలను పరిష్కరించారు. ఈ పనులకు రూ.21,11,66,852ల నష్టపరిహారం పంపిణీ చేశారు. అదేవిధంగా బెంగళూరు– చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులకు 1,57,113.70 చదరపు అడుగుల భూమిని కేటాయించి రూ. 84.80 కోట్ల పరిహారం అందించారు. 

జిల్లాలో పనిచేయడం అదృష్టం 
చిత్తూరు జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి సాగుతున్న కసరత్తును నిరంతరం పర్యవేక్షిస్తున్నా. ఆక్రమణకు గురైన భూములను తిరిగి ప్రభుత్వం పరం చేయడం సంతృప్తినిచ్చింది. కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్తా సహకారంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నాం. 
– మార్కండేయులు, జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు