పీఎస్‌ఎల్‌వీ సీ–40 ‘క్యాంపెయిన్‌’ప్రారంభం

12 Dec, 2017 03:32 IST|Sakshi

శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదికపై పీఎస్‌ఎల్‌వీ సీ–40కి మొదటి దశ మోటార్లను అనుసంధానం చేసే ప్రక్రియను (క్యాంపెయిన్‌) సోమవారం ప్రారంభించారు. వాస్తవానికి డిసెంబర్‌ నెలాఖరులోనే పీఎస్‌ఎల్‌వీ సీ–40 ప్రయోగిం చాలనుకున్నా.. రాకెట్‌ విడిభాగాలు షార్‌కు చేరుకోక పోవడంతో అనుసంధాన పనులు ఆలస్యమయ్యాయి. 2018 జనవరిలో ప్రయోగించనున్న ఈ రాకెట్‌ ద్వారా 30 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన పీఎస్‌ఎల్‌వీ సీ–39 ప్రయోగం విఫలమైన నాలుగు నెలల తరువాత చేస్తున్న మొదటి ప్రయోగం ఇదే. ఈ నేపథ్యంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ–40 రాకెట్‌ ద్వారా దేశీయ అవసరాల కోసం కార్టోశాట్‌–2 సిరీస్‌లో ఒక ఉపగ్రహం, విదేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. ఇందులో 25 చిన్న తరహా ఉపగ్రహాలు, మూడు అతిచిన్న ఉపగ్రహాలతో పాటు ఓ యూనివర్సిటికీ చెందిన ఉపగ్రహం కూడా ఉంటుందని ఇస్రో అధికారిక వర్గాల సమాచారం. 

మరిన్ని వార్తలు