పీఎస్‌ఎల్‌వీ సీ43 రెడీ

28 Nov, 2018 12:56 IST|Sakshi
నాలుగు దశల రాకెట్‌ అనుసంధానం పూర్తి చేసుకుని నింగికెగిరేందుకు లాంచ్‌ పాడ్‌ వద్దకు వెళుతున్న రాకెట్‌

భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)నుంచి నింగిలోగి ఎగిరేందుకు పీఎస్‌ఎల్‌వీ సీ43 వాహన నౌక సిద్ధమయింది. గురువారం ఉదయం 9.58 గంటలకు ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్‌ అనుసంధానం పూర్తి చేసుకుని నింగికెగిరేందుకు లాంచ్‌ పాడ్‌ వద్దకు వెళుతున్న రాకెట్‌.. 

శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 9.57 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ – 43 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనున్నారు. దీనికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశంలో ప్రయోగ తేదీని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున 5.57 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఉదయం 9.57 గంటలకు నింగివైపునకు దూసుకెళ్లేందుకు పీఎస్‌ఎల్వీ సీ – 43 రాకెట్‌ సిద్ధంగా ఉంది. నాలుగు దశల రాకెట్‌ అనుసంధానాన్ని పూర్తి చేసి మొబైల్‌ సర్వీస్‌ టవర్‌ (ఎంఎస్‌టీ)æ నుంచి రాకెట్‌ను ప్రయోగవేదికపై వదిలిపెట్టి వెనక్కి వచ్చింది. 44.4 మీటర్ల ఎత్తున పీఎస్‌ఎల్వీ సీ – 43 రాకెట్‌ ప్రయోగ సమయంలో ఇంధనంతో కలిపి 320 టన్నుల బరువుతో నింగికి పయనమవుతుంది. ప్రయోగంలో 380 కిలోల హైసిస్‌ స్వదేశీ ఉపగ్రహంతో పాటు 261.5 కిలోల బరువు కలిగిన 8 దేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను సన్‌ సింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఉపగ్రహాల బరువు 641.5 కిలోలు కావడంతో స్ట్రాపాన్‌ బూస్టర్లు లేకుండా ప్రయోగించనున్నారు. దీన్ని కోర్‌ అలోన్‌ ప్రయోగం అంటారు. షార్‌లోని మొదటి ప్రయోగవేదికకు సంబం«ధించిన మొబైల్‌ సర్వీస్‌ టవర్‌లో రాకెట్‌ను అనుసంధానించిన కొన్ని దృశ్యాలను ఇస్రో మంగళవారం విడుదల చేసింది.

రాకెట్‌లోని కోర్‌ అలోన్‌ దశ(ప్రథమ) ప్రయోగవేదికపై అనుసంధానం 


రాకెట్‌ మొదటి దశను కేరళలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో డిజైన్‌ చేసి తీసుకొచ్చి ఇక్కడ అనుసంధానం చేశారు. ఈ దశలో రాకెట్‌ నింగికి దూసుకెళ్లడానికి 138.2 టన్నుల ఘన ఇంధనాన్ని నింపుతారు


రాకెట్‌ రెండోదశలో విడి భాగాలను అమరుస్తున్న దృశ్యం

రాకెట్‌ రెండోదశలో 2.8 వ్యాసార్థంలో ఉన్న మోటార్‌లో 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఈ దశనూ వీఎస్సెస్సీలోనే తయారు చేశారు.     

మూడో దశ రాకెట్‌ విడిభాగాల అమరిక

ఈ దశ రెండు మీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. మూడో దశలో 7.6 టన్నుల ఘన ఇంధనం, నాలుగోదశలో 2.5 ద్రవ ఇంధనాన్ని నింపుతారు.  


నాలుగో దశకు పైభాగంలో 641.5 కిలోల బరువు కలిగిన 31 ఉపగ్రహాల పొందికను అమర్చి అనుసంధానం చేస్తున్న దృశ్యం    

శిఖరభాగంలో నాలుగో దశ రాకెట్‌ అనుసంధానం

ఈ దశలోనే ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. ఈ దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపుతారు. 

రాకెట్‌ అనుసంధానం పూర్తయ్యాక మొబైల్‌ సర్వీస్‌ టవర్‌ నుంచి రాకెట్‌ వదిలిపెట్టి వెనక్కి వెళ్తున్న దృశ్యం  
 

>
మరిన్ని వార్తలు