భయం వద్దు.. మనోబలమే మందు

29 Mar, 2020 05:25 IST|Sakshi

కరోనా వైరస్‌పై ఆందోళనతో పెరుగుతున్న మానసిక రుగ్మతలు

ఆరోగ్యం, ఉద్యోగ భద్రతపై ఆలోచనలు

ఆందోళన వద్దని చెబుతున్న మానసిక వైద్య నిపుణులు

లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ గురించి మితిమీరిన ఆలోచనలు, ఆందోళనతో కొంతమంది మానసిక రుగ్మతకు గురవుతున్నారు. భవిష్యత్‌ ఏమిటోనని బెంబేలు పడిపోతూ కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. లాక్‌ డౌన్‌తో ఖాళీ సమయం ఎక్కువగా ఉండి ప్రజలు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాను అనుసరిస్తున్నారు. కొంతమంది కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. అశాస్త్రీయమైన సమాచారం ఎక్కువగా వస్తుండటంతో ఆందోళన తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ విషయానికి సంబంధించి కొన్ని రోజులుగా మానసిక వైద్యులకు పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని తెలుస్తోంది. వారి సలహాలు తీసుకుంటూ కొందరు తమ మానసిక పరిస్థితిని అదుపులో ఉంచుకుంటున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంపై తగిన అవగాహన కలిగి ఉండి, లాక్‌డౌన్‌ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

సమయాన్ని సద్వినియోగం చేసుకోండి
మన చేతుల్లో లేని విషయాల గురించి ఆందోళన చెందకుండా లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మానసిక వైద్యుడు డా.ఇండ్ల విశాల్‌ సూచిస్తున్నారు. 
- ఇంట్లోనైనా కనీస వ్యాయామం చేయాలి. కుటుంబ సభ్యులు అందరూ కలసి కాసేపు వ్యాయామంగానీ యోగాగానీ చేస్తే మరీ మంచిది.
- ఈ ఖాళీ సమయంలో కొత్త అంశాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యమివ్వాలి. వంట చేయడం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.  
- పిల్లలు, కుటుంబసభ్యులతో కలసి ఇంటిపట్టునే ఉండి చెస్‌ లాంటి ఆటలు ఆడుకోవచ్చు. పెద్దలు తాము బాల్యంలో ఆడిన ఆటలను పిల్లలతో ఆడిపించాలి.
- పాత ఫొటో ఆల్బమ్‌లు చూసి నాటి మధురస్మృతులను నెమరువేసుకోవచ్చు. బిజీ లైఫ్‌లో చాలా కాలంగా మాట్లాడలేకపోయిన దూరప్రాంతాల్లోని కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఫోన్లో మాట్లాడి అనుబంధాలను బలోపేతం చేసుకోవచ్చు.
- టీవీల్లో మంచి సినిమాలు చూడటం, సంగీతాన్ని ఆస్వాదించడం వంటి వాటితో మానసిక ఉల్లాసం పొందవచ్చు. 

అవగాహన.. సమయం సద్వినియోగంతోనే పునరుత్తేజం
కరోనా వైరస్‌ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ వైరస్‌ పట్లగానీ లాక్‌డౌన్‌ పరిస్థితి గురించి గానీ మితిమీరిన ఆందోళన చెందితే కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని లాక్‌డౌన్‌ ఎత్తివేసే నాటికి పునరుత్తేజితులు కావచ్చు. పనిలో మరింత సమర్థంగా రాణించేందుకు సిద్ధంకావచ్చు.’            – డా.ఇండ్ల విశాల్, మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ

రుగ్మతల లక్షణాలు ఇవీ..
తీవ్ర ఆందోళనకు గురి అవుతున్న వారి లక్షణాలు ఇలా ఉంటాయని మానసిక వైద్యులు చెబుతున్నారు.
- ఆరోగ్యంగా ఉన్నా సరే జ్వరం వచ్చినట్లు భ్రమ, గొంతు బొంగురు పోయినట్టు భావన. మళ్లీ అంతలోనే మాములుగా అనిపించడం. ఒళ్లు వేడెక్కిందేమోనని మాటిమాటికీ చూసుకోవడం, ఇంట్లో వాళ్లను కూడా తన చెయ్యి పట్టుకుని చూడమని కోరడం.. ఇలాంటి లక్షణాలను హైపర్‌కాండ్రియాసిస్‌ అంటారని మానసిక వైద్యులు చెబుతున్నారు.
- పరిస్థితి అంతా బాగున్నా సరే.. అవసరం లేకున్నా సరే.. పక్కవారిని అనుసరిస్తూ పరిస్థితిని జఠిలం చేసుకుంటూ ఉంటారు. దీన్నే ‘సోషల్‌ కంటేజియన్‌’ అని అంటారు. నెలకు సరిపడా సరుకులు ఇంట్లో ఉన్నా.. అతి జాగ్రత్తతో మళ్లీ మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెస్తుంటారు. ఇరుగు పొరుగు వాళ్లు మార్కెట్‌కు వెళ్తున్నారు కదా.. మనం కూడా వెళ్లి మరిన్ని సరుకులు తెచ్చేసుకుందాం అని వారిని అనుసరిస్తారు.  
- తమ, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై మితిమీరిన ఆందోళనతో కొత్త సమస్యలు తెచ్చుకుంటారు. లాక్‌ డౌన్‌ ఎన్నాళ్లు ఉంటుందో, ఇంకా పొడిగిస్తారేమో, ఉద్యోగ భద్రతపై ఆందోళనతో తీవ్రంగా సతమతమవుతుంటారు. తమ చేతుల్లోలేని విషయం గురించి ఎక్కువగా ఆలోచించడంతో కుంగుబాటుకు గురి అవుతారు. ఈ కుంగుబాటు నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా